మద్యం రవాణా కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఈడీ అధికారులు కీలక చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. న్యాయమూర్తి ఉత్తర్వుల అనంతరం అధికారులు సునీల్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకుముందు నాంపల్లి కోర్టులో ఈడీ తరఫు న్యాయవాదులు, సునీల్ తరఫు న్యాయవాదులు తమ వాదనలను గట్టిగా వినిపించారు. ఈ అరెస్టాఫ్ దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది.
తండ్రి పలుకుబడితో కాంట్రాక్టులు
గత ప్రభుత్వంలో సునీల్ తండ్రి కారుమూరి నాగేశ్వరరావు పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారని ఈడీ తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించారు. తన తండ్రికున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని సునీల్ మద్యం రవాణా కాంట్రాక్టులను దక్కించుకున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన టెండర్లను తమకు అనుకూలంగా మార్చుకుని భారీగా అక్రమ లబ్ది పొందినట్లు ఆధారాలు సేకరించామని చెప్పారు. సునీల్ కుటుంబసభ్యుల మధ్య దాదాపు రూ. 7 కోట్ల మేర అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఖజానాకు భారీగా నష్టం
సుదర్శన కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన సందీప్, ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తులకు మద్యం రవాణా కాంట్రాక్ట్‌లు వచ్చేలా సునీల్ చక్రం తిప్పారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ కాంట్రాక్టులు ఇప్పించినందుకు ప్రతిఫలంగా సదరు సంస్థ నుండి సునీల్‌కు రూ. 28 కోట్ల మేర ముడుపులు అందినట్లు ఆరోపించింది. ఈ భారీ మద్యం రవాణా కుంభకోణం కారణంగా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 195 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఈడీ పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసులో లోతైన దర్యాప్తు జరుగుతోందని, మరిన్ని ఆధారాలను సరైన సమయంలో న్యాయస్థానానికి సమర్పిస్తామని స్పష్టం చేసింది.
సోదాల్లో కీలక వస్తువులు
ఈ అరెస్టుకు వారం రోజుల ముందే ఈడీ అధికారులు సునీల్, అతని తండ్రి నివాసాలపై విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఒక లగ్జరీ కారు, దాదాపు రూ. 94.5 లక్షల విలువైన చేతి గడియారాలు, భారీగా నగదు, ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు రాజ్ కెసిరెడ్డి అనే వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి న్యాయస్థానం సునీల్‌కు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణ కొనసాగుతోంది.











