ఏటా లక్షల కోట్ల విలువైన బంగారం
బంగారం దిగుమతులతో ప్రజలకే నష్టం
లెక్కలతో మైండ్ బ్లాంక్ చేసిన కోటక్ ఉదయ్
భారత్‌లో బంగారం కొనుగోళ్లు భారీగా ఉండటం వల్ల దేశంపై దిగుమతుల భారం పెరుగుతోందని ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ అన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో భారత్ దిగుమతి చేసుకునే బంగారం విలువ 88 నుంచి 90 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం చమురు ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు రూపాయి విలువ తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో బంగారం కోసం విదేశాలకు చెల్లించే డబ్బు కూడా పెరిగితే దేశ ఆర్థిక పరిస్థితిపై అదనపు భారం పడుతుందని చెప్పారు. భారత కుటుంబాల వద్ద పెద్ద మొత్తంలో బంగారం ఉందని, అది వ్యక్తిగత సంపదగా ఉన్నప్పటికీ దేశ ఆర్థికాభివృద్ధికి నేరుగా ఉపయోగపడటం లేదని కోటక్ పేర్కొన్నారు. బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్నది కాదు.. ఈ సంపదను దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలా ఉపయోగపడేలా చేయాలన్నదే ఆలోచించాల్సిన అంశమని ఆయన సూచించారు.
దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం
2025–26లో భారత్ కరెంట్ ఖాతా లోటు సుమారు 25 బిలియన్ డాలర్లు ఉండగా, బంగారం దిగుమతుల విలువ 72 బిలియన్ డాలర్లుగా ఉందని కోటక్ తెలిపారు. బంగారాన్ని పక్కన పెడితే భారత్‌కు కరెంట్ ఖాతాలో మిగులు ఉండేదన్నారు. చమురు ధరలు సగటున 90 డాలర్ల వద్ద ఉంటే ఈ ఏడాది కరెంట్ ఖాతా లోటు 60 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా వేశారు. బంగారం సమస్యపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయవచ్చని సూచించారు. దేశ ఆర్థిక లోటును కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
దేశంలో ఉత్పత్తి పెరగాలి
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ఇబ్బందులను భారత్ అవకాశంగా మార్చుకోవాలని కోటక్ సూచించారు. దేశానికి అవసరమైన వస్తువులు, సేవలను వీలైనంత వరకు భారత్‌లోనే తయారు చేయాలని అన్నారు. ప్రపంచానికి అవసరమైన ఉత్పత్తులను ఎక్కువగా ఎగుమతి చేస్తే విదేశాలపై ఆధారపడటం తగ్గుతుందని చెప్పారు. షేర్ మార్కెట్లు కేవలం కొనుగోళ్లు, అమ్మకాలకే పరిమితం కాకుండా కొత్త పరిశ్రమలకు పెట్టుబడులు అందించేలా పనిచేయాలని సూచించారు. ఆర్థిక సంస్థలను కాపాడుతూనే తప్పు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తే ప్రపంచ ఆర్థిక సవాళ్లను భారత్ మరింత సమర్థంగా ఎదుర్కోగలదని కోటక్ పేర్కొన్నారు.
#UdayKotak #GoldImports #IndiaGold #GoldImportBill #IndianEconomy #CurrentAccountDeficit #CAD #GoldDemand #Rupee #CrudeOil #IndiaEconomy #EconomicGrowth #FinancialMarkets #GoldInvestment #IndiaNews











