Home General ప్రకాశ్ రాజ్‌పై బీజేపీ ఫిర్యాదు సైబర్ డీజీకి నేతల వినతి

ప్రకాశ్ రాజ్‌పై బీజేపీ ఫిర్యాదు సైబర్ డీజీకి నేతల వినతి



హిందూ దేవుళ్లపై నటుడు ప్రకాశ్ రాజ్ చేసినట్లు ఆరోపిస్తున్న సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైమ్ డీజీ రవిశంకర్‌కు ఫిర్యాదు చేశారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో వల్లూరు జయప్రకాష్, షేక్ బాజీ, శ్రీనివాసరెడ్డి తదితరులు 57 మంది వివరాలతో కూడిన ఫిర్యాదును సమర్పించారు. అనంతరం భానుప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, శ్రీరాముడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, సీతాదేవి వంటి హిందూ ఆరాధ్య దైవాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా బాధించిందని అన్నారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడటం ఏ విధంగానూ సమర్థనీయం కాదని పేర్కొన్నారు. అలాంటి వీడియోలు చూసి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రకాశ్ రాజ్ హిందూ దేవుళ్లపై పదేపదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. దమ్ము, ధైర్యం ఉంటే ఇతర మతాల్లో జరుగుతున్న అంశాలపైనా మాట్లాడాలని సవాల్ విసిరారు. కేవలం హిందూ మతాన్ని, హిందూ దేవుళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం సమాజంలో ఉద్రిక్తతలకు దారితీస్తుందని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు సీరియస్‌గా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుపై సైబర్ పోలీసులు విచారణ చేపట్టాలని బీజేపీ నేతలు కోరారు. అయితే ఈ ఆరోపణలపై నటుడు ప్రకాశ్ రాజ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. ప్రస్తుతం ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

#PrakashRaj #BJP #AndhraPradesh #CyberCrime #PoliticalControversy #HinduSentiments #SocialMedia #APPolitics #BJPComplaint #CyberPolice #ReligiousControversy #IndiaNews