ప్రచారంపై సీజేఐ ఆగ్రహం.
విద్యార్థులపై పోలీసుల బలప్రయోగం అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఎలాంటి పిటిషన్ దాఖలు కాలేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. జూలై 20న జరిగిన సీజేపీ పార్లమెంట్ మార్చ్ సందర్భంగా జరిగిన ఘటనలపై కోర్టు విచారణకు నిరాకరించిందన్న వార్తలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కోర్టుకు ఒక న్యాయవాది నుంచి కేవలం వినతిపత్రం మాత్రమే వచ్చిందని, దానిని రిట్ పిటిషన్‌గా పరిగణించే అవకాశం లేదని వెల్లడించారు.
లేఖ ఆధారంగా విచారణ కోరిన న్యాయవాది
ఈ అంశంపై కొన్ని మీడియా సంస్థలు బాధ్యతారహితంగా వార్తలు ప్రచారం చేశాయని సీజేఐ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం వరకు కూడా సుప్రీంకోర్టులో ఒక్క పేజీ పిటిషన్ కూడా దాఖలు కాలేదని చెప్పారు. అలాంటి పరిస్థితిలో కోర్టు విచారణకు నిరాకరించిందని ప్రచారం చేయడం సరికాదన్నారు. నిజాలు తెలుసుకోకుండా వార్తలు ప్రచురించడం సమంజసం కాదని స్పష్టం చేశారు. బుధవారం విచారణ సమయంలో న్యాయవాది నరేంద్ర మిశ్రా రాసిన లేఖను ప్రస్తావిస్తూ విద్యార్థులపై జరిగిన పోలీసు దాడుల వీడియోలు పరిశీలించాలని కోరారు. అయితే వీడియోలు చూసేందుకు కోర్టుకు సమయం లేదని సీజేఐ తెలిపారు. కేవలం లేఖ ఆధారంగా సుమోటో విచారణ ప్రారంభించలేమని స్పష్టం చేశారు. దీంతో ఈ అంశంపై సుప్రీంకోర్టులో ఎలాంటి అధికారిక విచారణ మొదలుకాలేదు.
ఢిల్లీ హైకోర్టులో విచారణ కొనసాగింపు
ఇదే సమయంలో ఢిల్లీ హైకోర్టు మాత్రం విద్యార్థులపై పోలీసులు అధిక బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. నిరసనలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, వీడియోలు, ఇతర ఆధారాలను భద్రపరచాలని అధికారులను ఆదేశించింది. ఈ కేసులపై తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది. జూలై 20న సీజేపీ నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా వేలాది మంది విద్యార్థులు పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ఉపయోగించడంతో పలువురు గాయపడ్డారు. పెల్లెట్ గన్ గాయాల ఆరోపణలు కూడా దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
#CJISuryaKant #SupremeCourt #StudentProtest #SJP #DelhiPolice #DelhiHighCourt #NEETProtest #PoliceAction #StudentIssues #PelletGunAllegation #LegalNews #IndianJudiciary











