ఆషాఢ మాసం శుక్రవారం, సారె ఉత్సవాలు ఒకేసారి రావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారెలతో అమ్మవారికి సమర్పణలు చేసేందుకు భారీ సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పిస్తూ అంతరాలయ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. క్యూలైన్లు వేగంగా కదిలేలా చర్యలు తీసుకోవడంతో భక్తులు తక్కువ సమయంలోనే దర్శనం పూర్తి చేసుకున్నారు. ఆషాఢ సారె ఉత్సవాల పదో రోజైన శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు 42 సారె బృందాల ద్వారా 16,890 మంది మహిళలు అమ్మవారికి సారె సమర్పించారు. ఈ నెల 15 నుంచి ఇప్పటివరకు 1,94,030 మంది మహిళలు సారె సమర్పించినట్లు ఈవో వి.కె. శీనా నాయక్ తెలిపారు. మరో 20 రోజుల్లో దాదాపు మూడు లక్షల మంది మహిళలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. తొలిసారిగా అమలు చేసిన సారె బృందాల నమోదు విధానం, ప్రత్యేక క్యూలైన్లు, ఉచిత దర్శనం, ప్రసాదం, అన్నప్రసాదం కారణంగా భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఆషాఢ ఉత్సవాలు ముగిసే వరకు ఇదే స్థాయిలో రద్దీ కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.
#Indrakeeladri #KanakaDurgaTemple #AshadaSare #AshadaMasam #Vijayawada #TempleFestival #Devotees #AndhraPradeshTemples #KanakaDurgaDevi #SareUtsavam #SpiritualNews #APNews











