కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాధిక్ ఖాన్ ఢిల్లీలో పోలీసులకు చిక్కినట్లు సమాచారం. నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత సాధిక్ పరారయ్యాడు. అతడిని పట్టుకునేందుకు పది మంది ఎస్ఐలు సహా సుమారు 40 మంది పోలీసులు ప్రత్యేక బృందాలుగా గాలింపు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో వెతికిన పోలీసులు చివరకు పక్కా సమాచారంతో ఢిల్లీలో తనిఖీలు నిర్వహించి సాధిక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడిని కాకినాడకు తరలించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. ఆదివారం నాటికి నిందితుడిని కాకినాడకు తీసుకురావచ్చని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సూసైడ్ నోట్లో సంచలన ఆరోపణలు
నూకరాజు, ఆయన భార్య, కుమార్తె ఈ నెల 16న రాజమహేంద్రవరం సమీపంలో గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనకు ముందు రాసిన సూసైడ్ నోట్లో సాధిక్ వేధింపులే తమ దుస్థితికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించినట్లు పోలీసులు చెబుతున్నారు. నూకరాజు కుటుంబంతో పరిచయం పెంచుకున్న సాధిక్ క్రమంగా వారిపై ప్రభావం చూపాడని ఆరోపణలు ఉన్నాయి. కుమార్తె సౌజన్యను లోబరుచుకునేందుకు ప్రయత్నించడం, ప్రైవేట్ ఫొటోలతో బెదిరించడం, ఆస్తుల కోసం ఒత్తిడి చేయడం, మతం మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. సౌజన్య భర్త జగదీశ్వర్‌రెడ్డి మరణం కూడా ఈ వ్యవహారంలో కీలకంగా మారింది. ఆయనకు విషపూరిత పదార్థం ఇచ్చి చంపాడని సౌజన్య రాసిన లేఖలో ఆరోపించినట్లు సమాచారం. ఈ ఆరోపణలపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. నూకరాజు, సౌజన్య మృతదేహాలు లభించగా, ఆయన భార్య మీనా మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. మనవడు మాత్రం ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డాడు.
సాధిక్ అరెస్ట్‌తో అసలు మిస్టరీపై దృష్టి
జగదీశ్వర్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా సర్పవరం పోలీసులు సాధిక్‌పై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు విషయం తెలియగానే అతడు మొబైల్ ఫోన్‌ను వదిలేసి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు సాధిక్ పట్టుబడటంతో నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పరిణామాలు, జగదీశ్వర్‌రెడ్డి మృతి వెనుక ఉన్న అసలు కారణాలు, ఆస్తుల వ్యవహారం, బ్లాక్మెయిల్ ఆరోపణలపై విచారణ మరింత కీలకంగా మారనుంది. షూటింగ్ అకాడమీకి వచ్చే యువతులు, బాలికలతో అనుచితంగా ప్రవర్తించేవాడనే ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు సాధిక్ గత వ్యవహారాలపై ఆరా తీయనున్నారు. అయితే ఆరోపణలు నిజమా కాదా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఐదు రోజుల గాలింపు తర్వాత నిందితుడు చిక్కడంతో కేసులో కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఏర్పడింది.
#SadiqKhan #SadiqKhanArrest #NookarajuFamilyCase #KakinadaNews #AndhraPradeshNews #KakinadaPolice #Nookaraju #GodavariRiver #Rajamahendravaram #CrimeNews #PoliceInvestigation #AndhraPradeshPolice #ShootingCoach #BreakingNews











