Home General ప్రకాశ్‌రాజ్‌ ఓటు.. ఈసీ లేటు!… 24 గంటలు ఏం చేస్తున్నావ్ ఈసీ.. సోషల్ మీడియాలో...

ప్రకాశ్‌రాజ్‌ ఓటు.. ఈసీ లేటు!… 24 గంటలు ఏం చేస్తున్నావ్ ఈసీ.. సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం

నిన్నంతా వార్తలే.. నేడు వివరణ
ఆలస్యపు స్పందనపై మళ్లీ ప్రశ్నలు

వార్త వైరల్.. ఈసీ మౌనం

ప్రకాశ్‌రాజ్‌ ఓటు హక్కుపై చేసిన ఆరోపణలు నిన్నంతా మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించారని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ‘‘ఓటు హక్కు ఎలా పోయింది?’’ అంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. సర్ ప్రక్రియలో తన పేరు తొలగించారంటూ చేసిన ఈ ఆరోపణపై ఎన్నికల యంత్రాంగం వెంటనే స్పందిస్తుందని అందరూ భావించారు. కానీ గంటలు గడిచినా స్పష్టమైన వివరణ బయటకు రాలేదు.

ఆర్నెల్లకు గుర్తొచ్చినట్టు..

చివరకు అధికారులు స్పందించడంతో ‘దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు’ అన్న సామెత గుర్తుకొస్తోంది. ప్రకాశ్‌రాజ్‌ పేరు ఓటర్ల జాబితా నుంచి తొలగించలేదని బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఆయన పేరు శాంతినగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ జాబితాలోనే ఉందని తెలిపింది. అయితే పాత చిరునామాలో ఆయన నివసించడం లేదని గుర్తించి రికార్డుల్లో ‘షిఫ్టెడ్‌’గా మార్క్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కొత్త చిరునామాకు ఓటును మార్చుకునే అవకాశం ఉందని వివరించారు.

ఈసీ అసలు చేస్తున్న పని ఇదే

సర్‌లో  భాగంగా ఎన్నికల అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నారు. మరణించినవారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారినవారు, డూప్లికేట్‌ నమోదులు వంటి వివరాలను గుర్తించి జాబితాను శుద్ధి చేయడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. అదే సమయంలో అర్హులైన ఓటర్ల పేరు పొరపాటున తొలగిపోకుండా అభ్యంతరాలు, క్లెయిమ్‌లకు అవకాశం కల్పించడం కూడా కీలకం. ప్రకాశ్‌రాజ్‌ వ్యవహారం ఒక వ్యక్తి పేరు గురించిన వివాదంగా కనిపించినా, అసలు ప్రశ్న మాత్రం పెద్దది—ఓటరు పేరు మారినప్పుడు, తొలగించినప్పుడు అధికారుల నుంచి సమాచారం ఎంత వేగంగా, ఎంత పారదర్శకంగా అందుతోంది? నిన్నటి ఆరోపణకు నేటి వివరణ రావడం వల్ల ఈ ప్రశ్న మరింత బలంగా వినిపిస్తోంది.