పట్టాభిరామ్.. తేల్చుకుందాం రా!
ప్రొద్దుటూరు నిజంగా స్వచ్ఛంగా ఉందా.. లేక కాగితాలకే పరిమితమైన ప్రచారమా? ప్రజలే జడ్జిలని చెబుతూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి నేరుగా సవాల్ విసిరారు. “పట్టణం పరిశుభ్రంగా ఉందని ప్రజలు చెబితే నీ ఇంట్లో మూడేళ్లు పారిశుధ్య పనులు చేస్తా.. లేకపోతే నా ఇంట్లో అదే పని చేయడానికి సిద్ధమా?” అంటూ పట్టాభిరామ్‌కు ఛాలెంజ్ చేశారు. స్వచ్ఛాంధ్ర పేరుతో గొప్పలు చెప్పుకోవడం కంటే వీధుల్లోకి వచ్చి వాస్తవాలు చూడాలని ఎద్దేవా చేశారు. ప్రచారంతో కాదు.. ప్రజల తీర్పుతోనే ఎవరి మాట నిజమో తేలిపోతుందని రాచమల్లు వ్యాఖ్యానించారు.

ప్రజలే తీర్పు చెబుతారు.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు

ప్రొద్దుటూరులో పారిశుధ్య పరిస్థితిపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, కేవలం కంపోస్టు యార్డులు ఏర్పాటు చేయడం వల్ల పట్టణం పరిశుభ్రంగా మారదన్నారు. పారిశుధ్యంపై ప్రజల అభిప్రాయమే అసలైన కొలమానమని పేర్కొంటూ, ప్రజలు ప్రొద్దుటూరు పరిశుభ్రంగా ఉందని చెబితే పట్టాభిరామ్ ఇంట్లో మూడు సంవత్సరాలు పారిశుధ్య పనులు చేయడానికి సిద్ధమని, లేకపోతే తన ఇంట్లో అదే పని చేయడానికి ఆయన సిద్ధమా అంటూ బహిరంగ సవాల్ విసిరారు.

జగన్ పాలనతో పోలిక

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక సిబ్బంది, వాహనాల ద్వారా ఇంటింటికీ చెత్త సేకరణ చేపట్టి పారిశుధ్యాన్ని మెరుగుపరిచామని రాచమల్లు తెలిపారు. ప్రస్తుతం చెత్త పన్ను ఎత్తివేశామని చెబుతున్న ప్రభుత్వం పరోక్షంగా ప్రజలపైనే భారం మోపుతోందని ఆరోపించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేశారని, కడప జిల్లా ఎప్పటికీ వైఎస్సార్ కుటుంబానికే అండగా ఉంటుందని చెప్పారు. బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు, కొప్పర్తి పారిశ్రామిక వాడ, కడప విమానాశ్రయ విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించిన ఆయన, సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని, తప్పుడు ప్రచారాలతో వారిని తప్పుదోవ పట్టించడం సాధ్యం కాదన్నారు.