పని మాత్రం ప్రభుత్వానిది… బతుకు మాత్రం కాంట్రాక్టుదే! ఉదయం నుంచి రాత్రి వరకు వీధి దీపాలు వెలిగించాలి, తాగునీరు అందించాలి, పారిశుధ్యం చూసుకోవాలి… కానీ నెలాఖరుకు వచ్చే జీతం చూసుకుంటే కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కాని పరిస్థితి. ఉద్యోగ భద్రత లేదు, పీఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు… బాధ్యతలు మాత్రం శాశ్వత ఉద్యోగులకంటే ఎక్కువ. ప్రభుత్వాలు మారుతున్నాయి, హామీలు మారుతున్నాయి, కానీ కాంట్రాక్ట్ ఉద్యోగుల బతుకులు మాత్రం మారడం లేదు. “మా సేవలు అవసరం అయితే మా ఉద్యోగాలకు భద్రత ఎందుకు లేదు?” అని ప్రశ్నిస్తూ అమలాపురంలో గ్రామపంచాయతీ కాంట్రాక్ట్ ఉద్యోగులు మరోసారి తమ ఆవేదనను ప్రభుత్వానికి వినిపించారు. ఉద్యోగ భద్రతే ప్రధాన డిమాండ్
ప్రభుత్వ జోక్యం కోరిన ఉద్యోగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టి తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ ఉద్యోగ భద్రత, వేతనాలు, సంక్షేమ అంశాలు మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీలు గ్రేడ్‌లుగా మారిన నేపథ్యంలో అర్హత, అనుభవానికి ప్రాధాన్యం ఇచ్చి తమ సేవలను క్రమబద్ధీకరించాలని కోరారు. అలాగే ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తక్కువ వేతనాలతో వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ సరైన గుర్తింపు లభించడం లేదని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు గండ్రు సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్డి వేమలరావు తదితర నాయకులు పాల్గొని ప్రభుత్వాన్ని వెంటనే స్పందించాలని కోరారు.










