Home AP 372 మందికి పట్టాల పంపిణీ

372 మందికి పట్టాల పంపిణీ

2029లోపు మంగళగిరి మారుస్తా.
ప్రతి ఇంటికీ నీరు, గ్యాస్‌, డ్రైనేజీ.
మంత్రి నారా లోకేశ్ భరోసా .

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి నారా లోకేశ్‌ కీలక హామీ ఇచ్చారు. 2029 నాటికి ప్రతి ఇంటికీ తాగునీరు, పైప్‌డ్‌ గ్యాస్‌, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ సౌకర్యాలు కల్పించే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. సోమవారం తాడేపల్లిలో 372 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి స్థల పట్టాలు, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. మంగళగిరిలో దశాబ్దాలుగా ఉన్న 100 పడకల ఆస్పత్రి కల త్వరలో సాకారం కానుందని తెలిపారు. 2019లో పేదలకు ఇంటి స్థలాల పట్టాలపై హామీ ఇచ్చే ముందు నియోజకవర్గ సమస్యలను పూర్తిగా అధ్యయనం చేశానని, ఇచ్చిన మాటను ఇప్పుడు అమలు చేశానని లోకేశ్‌ చెప్పారు.

రూ.2 వేల కోట్ల భూముల పంపిణీ

అర్హులైన లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం శాశ్వత పట్టాలు అందిస్తోందని లోకేశ్‌ తెలిపారు. ఇప్పటివరకు మంగళగిరి నియోజకవర్గంలో మూడు దశల్లో 6,060 పట్టాల ద్వారా దాదాపు రూ.2,000 కోట్ల విలువైన భూములను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రిగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. నిడమర్రు జెడ్పీ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా మోడల్‌ స్కూల్‌గా తీర్చిదిద్దామని, ఇదే తరహాలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం

మంగళగిరి పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిని తన ప్రధాన కార్యక్రమాల్లో ఒకటిగా లోకేశ్‌ పేర్కొన్నారు. నియోజకవర్గంలో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గుత్తికొండ ధనుంజయ్‌, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి తదితరులు పాల్గొన్నారు.

 

#NaraLokesh #Mangalagiri #MangalagiriDevelopment #HouseSitePattas #PMAY #AndhraPradesh #APGovernment #InfrastructureDevelopment #DrinkingWater #PipedGas #UndergroundDrainage #MangalagiriHospital #GovernmentSchools #APNews #NaraLokesh2029