పోలీసుల తీరుపై బొత్స ఆగ్రహం.
పంట నష్టం పరిహారానికి డిమాండ్ .
ఏపీలో సచివాలయ ఉద్యోగుల నిరసనపై ప్రభుత్వం, పోలీసుల వ్యవహారశైలిని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోరితే పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని చెప్పారు. వందలాది మంది ఉద్యోగులను నిర్బంధించడం సరికాదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన అందించాలనే ఉద్దేశంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఉద్యోగులు కోరుతున్న సర్వీస్, ప్రమోషన్లు, పీఆర్సీ వంటి అంశాలపై ప్రభుత్వం చర్చించి వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
పంటలు దెబ్బతిన్నా సర్కార్ స్పందనేదీ?
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, తుపాను కారణంగా ఉత్తరాంధ్రలో అరటి, బొప్పాయి, మొక్కజొన్న, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని బొత్స తెలిపారు. రైతులు పెట్టుబడులు కోల్పోయినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పరిహారం అందించామని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చామని చెబుతున్నా, ఎంతమంది రైతులకు నష్టపరిహారం ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. బీమా సౌకర్యంపై కూడా స్పష్టత లేదన్నారు. పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేసి వాస్తవ నష్టానికి అనుగుణంగా రైతులకు తక్షణ పరిహారం అందించాలని బొత్స డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగుల నిరసనను అణచివేయడం ద్వారా సమస్య పరిష్కారం కాదని బొత్స అన్నారు. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం వారితో చర్చించాలని కోరారు. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ఆలస్యం చేయొద్దని సూచించారు. ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం, రైతులకు నష్టపరిహారం రెండు అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
#BotsaSatyanarayana #APSecretariatEmployees #EmployeesProtest #AndhraPradesh #APPolitics #PoliceAction #EmployeeDemands #PRC #EmployeePromotions #NorthAndhra #CropLoss #FarmerCompensation #APFarmers #YSRCP #Botsa











