Home AP ఇంద్రకీలాద్రిపై గొంతు నొక్కుతున్నారా?

ఇంద్రకీలాద్రిపై గొంతు నొక్కుతున్నారా?

భక్తుల ఇబ్బందులు బయటపడకూడదనే కుట్ర.
మీడియా ఆంక్షలపై వెలంపల్లి తీవ్ర ఆగ్రహం.

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మీడియా ప్రతినిధులను కొండపైకి అనుమతించకపోవడంపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా మండిపడ్డారు. సామాన్య భక్తుల సమస్యలు, అధికారుల వైఫల్యాలు బయటకు రాకుండా ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు, మీడియా సంస్థలకు పాసులు ఇచ్చి, ప్రధాన స్రవంతి మీడియాను అడ్డుకోవడం సరికాదన్నారు. ఉదయం నుంచి మీడియా ప్రతినిధులు నిరసన తెలుపుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. ఎవరికి ఎన్ని పాసులు జారీ చేశారో వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మీడియాను చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.

వీఐపీలకు సౌకర్యాలు.. భక్తులకు కష్టాలు

కొండపై వీఐపీ వాహనాలు తిరుగుతున్నా, సామాన్య భక్తులు ఎండలో గంటల తరబడి క్యూలైన్లలో ఇబ్బందులు పడుతున్నారని వెలంపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, మజ్జిగ, ప్రసాదం వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు. వృద్ధులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు. ఆంక్షలతో భక్తులు భయపడి దర్శనానికి రావడం తగ్గుతోందని పేర్కొన్నారు. అమ్మవారి ఆలయం ఎవరి సొంత జాగీరు కాదని, అది అందరిదని స్పష్టం చేశారు. మీడియా స్వేచ్ఛను కాపాడాలని, వెంటనే పాసులు జారీ చేసి ప్రతినిధులను అనుమతించాలని డిమాండ్ చేశారు. అధికారుల వైఫల్యాలను సరిదిద్ది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. మీడియాకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడి పోరాడతానని హెచ్చరించారు.

#Indrakeeladri #DasaraCelebrations #VelampalliSrinivasRao #KanakaDurgaTemple #MediaRestrictions #MediaFreedom #Vijayawada #Sharannavaratri #Devotees #TempleArrangements #VIPDarshan #AndhraPradeshNews #APPolitics