బుల్లెట్ ట్రైన్ భూములపై కేటీఆర్ ఫైర్.
రైతులకు అండగా ఉంటామని భరోసా .
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పేరుతో తమ భూములను ప్రభుత్వం అన్యాయంగా తీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేసిన శంషాబాద్ మండలం బహదూర్‌గూడ రైతులను కేటీఆర్ తెలంగాణ భవన్‌లో కలిశారు. రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, వారి తరఫున బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పేదల భూములను తీసుకుని వాటిని విక్రయించి కమీషన్లు పొందడమే రేవంత్‌రెడ్డి ప్రభుత్వ విధానమని కేటీఆర్ ఆరోపించారు. రైతుల భూములకు పట్టాలు ఇవ్వకపోతే రాళ్లతో కొట్టాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ గతంలో చెప్పారని గుర్తుచేశారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెడితే మీరే నష్టపోతారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని రేవంత్‌రెడ్డి అన్నారని పేర్కొంటూ, ఇప్పుడు రైతుల భూముల విషయంలో ఎవరిని రాళ్లతో కొట్టాలని ప్రశ్నించారు.
4 వేల మంది పోలీసులపై ప్రశ్నలు
రైతుల ఇళ్ల వద్దకు ఏదో పక్క దేశంపై దండయాత్రకు వెళ్లినట్లు 4 వేల మంది పోలీసులను పంపించారని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం వద్ద భూములకు సంబంధించిన పత్రాలు ఉంటే వాటిని చూపించాలని, అంతమంది పోలీసులను ఎందుకు మోహరించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. భూములు ప్రభుత్వానివేనని ఆధారాలు ఉంటే పత్రాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. రైతులపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని ఆయన అన్నారు. బుల్లెట్ ట్రైన్‌కు బీఆర్‌ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన కేటీఆర్, ప్రాజెక్ట్ పేరుతో రియల్ ఎస్టేట్ దందా జరిగితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఫ్యూచర్ సిటీ పేరుతో భూదందా
బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రైతులు భూములు ఇచ్చింది ఫార్మా సిటీ కోసమే తప్ప ఫ్యూచర్ సిటీ కోసం కాదని అన్నారు. మహేశ్వరం, కల్వకుర్తి ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు భారీగా భూదందా చేస్తున్నారని ఆరోపించారు. బినామీల వివరాలను సరైన సమయంలో వెల్లడిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోందని విమర్శించారు. బుల్లెట్ రైలుకు బీఆర్‌ఎస్ వ్యతిరేకం కాదని, దాని పేరుతో జరుగుతున్న భూసేకరణ, భూ దోపిడీకి మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. శంషాబాద్ విమానాశ్రయం కోసం సేకరించిన భూముల్లోనే బుల్లెట్ రైలు ఏర్పాటు చేయొచ్చని సూచించారు. ఏడాదిన్నరలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని, అప్పుడు రైతుల పట్టాలను తిరిగి అప్పగిస్తామని పేర్కొన్నారు. మోసపోతే గోసపడతారని కేసీఆర్ ముందే హెచ్చరించారని గుర్తుచేశారు.
#KTR #ShamshabadFarmers #BulletTrain #FutureCity #Telangana #LandAcquisition #Farmers #BRS #KTRNews #TelanganaPolitics #FarmerLandRights #HyderabadFutureCity #RevanthReddy











