వచ్చే దీపావళికి ఇందిరమ్మ టవర్స్ రెడీ.
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం.
ఆర్థిక ఇబ్బందులున్నా ఇళ్ల పంపిణీ ఆగదు.
రెవిన్యూ మంత్రి మంత్రి పొంగులేటి వెల్లడి.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు మిగిల్చినా, ఎల్‌నినో వంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని నిలిపివేసే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని విలువైన ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ పనులను వచ్చే దీపావళి నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని ప్రకటించారు. లబ్ధిదారులు కొత్త ఇళ్లలోనే దీపావళి జరుపుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. మరో మూడు విడతల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని వెల్లడించారు.
మైలార్దేవుపల్లిలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన
రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల లబ్ధిదారుల కోసం మైలార్దేవుపల్లిలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌కు గురువారం మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్యూర్ పరిధిలోని 23 నియోజకవర్గాల్లో కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరుగుతోందని పొంగులేటి తెలిపారు. లబ్ధిదారుల కళ్లలో కనిపిస్తున్న ఆనందబాష్పాలే తమ ప్రభుత్వానికి ఆశీస్సులని భావోద్వేగంగా పేర్కొన్నారు. గత పాలకులు పేదల ఇళ్ల విషయంలో మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై కూడా కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు ప్రధాన హామీలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
లక్కీడ్రాలో మహిళకు తొలి ఫ్లాట్ కేటాయింపు
ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియను లక్కీడ్రా ద్వారా ప్రారంభించారు. ఇందులో కవిత రాథోడ్ అనే మహిళకు సి బ్లాక్‌లోని 603వ ఫ్లాట్ కేటాయించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు స్వయంగా ఆమెకు కేటాయింపు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఈ నెల 19 నుంచి నాణ్యమైన చిలకాకుపచ్చ రంగు బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, హౌసింగ్ శాఖ ఎండీ వి.పి. గౌతమ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, మాజీ మేయర్ పారిజాతం, పలువురు అధికారులు పాల్గొన్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే ఇందిరమ్మ ఇళ్ల పథకం వెనుక ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పునరుద్ఘాటించారు.
#IndirammaHousing #IndirammaTowers #PonguletiSrinivasReddy #TelanganaGovernment #TelanganaHousingScheme #Hyderabad #MylarDevpally #AffordableHousing #RevanthReddy #BathukammaSarees











