మీ సేవా డోర్‌స్టెప్ డెలివరీ షురూ .
1100కు కాల్ చేస్తే ఇంటికే సర్వీసులు.
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఇకపై మీ సేవా కేంద్రాలకు వెళ్లకుండానే ఇంటి వద్ద నుంచే పలు ప్రభుత్వ సేవలను పొందే అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా మీ సేవా డోర్‌స్టెప్ డెలివరీ (డీఎస్డీ) కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. నవంబర్ 12న గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (డీఎస్డీ) శాఖ, సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సంయుక్తంగా పౌర సౌకర్యాలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాయి. ఈ సమావేశానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జి. సృజన, ఈఎస్డీ కమిషనర్ టి. రవికిరణ్ హాజరయ్యారు. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, గేటెడ్ కమ్యూనిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఒక్క ఫోన్ కాల్‌తో ఇంటికే మీ సేవలు
ఈ కార్యక్రమంలో ఈఎస్డీ కమిషనర్ టి. రవికిరణ్ మీ సేవా డోర్‌స్టెప్ డెలివరీ విధానాన్ని పరిచయం చేశారు. శిక్షణ పొందిన, ధ్రువీకరించిన ప్రతినిధులు ప్రజల ఇళ్లకు వచ్చి ప్రభుత్వ సేవలను అందిస్తారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, ఉద్యోగులకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సేవలను పొందాలనుకునే వారు 1100 నంబర్‌కు ఫోన్ చేసి 1 నంబర్‌ను నొక్కాలి. లేదా https://dsd.meeseva.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి సేవలను పొందవచ్చు. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గి, సమయం ఆదా అవుతుంది. ప్రజలకు సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి.
ప్రయాణ సౌకర్యాలకు మీటికెట్ యాప్
కార్యక్రమంలో సైబరాబాద్ ప్రాంతంలో మెరుగైన, పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించే ‘సైబరాబాద్ మూవ్స్’ కార్యక్రమంపై కూడా ప్రత్యేకంగా వివరించారు. నవేద్, శ్రీనివాస్ అలవిల్లి ఈ కార్యక్రమం లక్ష్యాలను వివరించారు. ఈ సందర్భంగా మీటికెట్ యాప్‌ను కూడా పరిచయం చేశారు. ఈ యాప్ ద్వారా నగర బస్సులు, మెట్రో రైలు టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు బస్ పాసుల కోసం దరఖాస్తు చేయవచ్చు, వాటిని రెన్యువల్ చేసుకోవచ్చు. జూలాజికల్ పార్కులు, ఇతర పార్కుల ప్రవేశ టికెట్లను కూడా పొందవచ్చు. ఈ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేయాలని, పోస్టర్లు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్డబ్ల్యూఏ ప్రతినిధులకు సూచించారు. ప్రభుత్వ సేవలు, డిజిటల్ సౌకర్యాలు, రవాణా వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ కార్యక్రమం లక్ష్యం అని ఎస్సీఎస్సీ ప్రతినిధులు తెలిపారు.
#Meeseva #DoorstepDelivery #TelanganaGovernment #GovernmentServices #1100Helpline #MeesevaDSD #Cyberabad #MeetiketApp #CyberabadMoves #DigitalServices











