స్కామ్ ప్రకటనలతో మెటాకు వేల కోట్లు
మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థ సోషల్ మీడియా వేదికలపై కొన్ని రకాల కంటెంట్‌ను బూస్ట్ చేయడానికి భారీగా డబ్బులు చెల్లించబడినట్లు కేంద్ర ప్రభుత్వం ముందు అంగీకరించినట్లు సమాచారం. ఈ అంగీకారం తీవ్ర చర్చకు దారితీసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికలపై అక్రమ ప్రకటనలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలకు ఇది మరింత బలం చేకూర్చింది.
ఏడాదికి 7 బిలియన్ డాలర్ల ఆదాయం
2025లో వెలుగులోకి వచ్చిన రాయిటర్స్ నివేదిక ప్రకారం, స్కామ్ ప్రకటనల ద్వారా మెటా సంవత్సరానికి సుమారు 7 బిలియన్ డాలర్ల ఆదాయం పొందినట్లు సంస్థ అంతర్గత పత్రాలు సూచించాయి. మోసపూరిత ఈ-కామర్స్, నకిలీ పెట్టుబడి పథకాలు, అక్రమ ఆన్లైన్ క్యాసినోలు, నిషేధిత ఉత్పత్తుల విక్రయ ప్రకటనలను గుర్తించి నిలిపివేయడంలో మెటా విఫలమైందని నివేదిక పేర్కొంది.
రోజుకు 15 బిలియన్ హై రిస్క్ ప్రకటనలు
2024 డిసెంబర్‌కు చెందిన సంస్థ అంతర్గత పత్రాల ప్రకారం, ప్రతిరోజూ దాదాపు 15 బిలియన్ “హై రిస్క్” స్కామ్ ప్రకటనలు వినియోగదారులకు కనిపించినట్లు వెల్లడైంది. మోసపూరిత ప్రకటనలపై చర్య తీసుకోవాలంటే ఆటోమేటిక్ సిస్టమ్‌కు కనీసం 95 శాతం నమ్మకం ఉండాలనే విధానం ఉండటమే ప్రధాన లోపంగా నివేదిక వివరించింది. ఈ కారణంగా అనేక ప్రమాదకర ప్రకటనలు యథావిధిగా కొనసాగినట్లు పేర్కొంది. ఈ ఆరోపణలను మెటా అధికార ప్రతినిధి ఆండీ స్టోన్ గతంలో ఖండించారు. బయటకు వచ్చిన పత్రాలు సంస్థ విధానాలను వక్రీకరించి చూపుతున్నాయని ఆయన చెప్పారు. మోసాలు, స్కామ్‌లను అరికట్టేందుకు సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టిందని, వినియోగదారులు, ప్రకటనదారులు, సంస్థ ఎవరికీ అలాంటి కంటెంట్ అవసరం లేదని స్పష్టం చేశారు.
అంతర్గత హెచ్చరికలు పట్టించుకోలేదా?
నివేదిక ప్రకారం, 2022 నుంచే ఆటోమేటిక్ స్కామ్ గుర్తింపు వ్యవస్థలో పెట్టుబడులు తక్కువగా ఉన్నాయని సంస్థలోనే హెచ్చరికలు వచ్చాయి. 2023లో వినియోగదారులు ప్రతి వారం లక్షకు పైగా చెల్లుబాటు అయ్యే స్కామ్ ఫిర్యాదులు చేసినప్పటికీ, వాటిలో సుమారు 96 శాతం ఫిర్యాదులను మెటా పట్టించుకోలేదని అంతర్గత పత్రాలు వెల్లడించాయి. అమెరికాలో జరిగే మొత్తం స్కామ్‌లలో మూడో వంతుకు మెటా వేదికలు కారణమవుతున్నాయని సంస్థ భద్రతా బృందం చేసిన అంచనాలో కూడా ప్రస్తావించినట్లు నివేదిక తెలిపింది.











