Home AP డీఎస్సీ స్కామ్‌పై గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు

డీఎస్సీ స్కామ్‌పై గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు

సీబీఐ విచారణకు వైసీపీ అధినేత డిమాండ్.

విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలిశారు. డీఎస్సీ-2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వివరాలతో కూడిన వినతిపత్రం అందించారు. సెప్టెంబర్‌ 21న ఎస్‌ఏఏపీ కార్యాలయం వద్ద జరిగిన ఘటనను కూడా గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. నిరుద్యోగులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి జరిగిందని జగన్‌ ఆరోపించారు. శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు అనుమతి తీసుకున్నప్పటికీ ప్రత్యామ్నాయంగా మరో ధర్నా నిర్వహించి తమపై దాడి చేశారని అన్నారు. దాడికి గురైన వారిపైనే పోలీసులు తీవ్ర కేసులు నమోదు చేశారని ఆరోపించారు.

పరీక్ష నిర్వహణపైనే తొలి ప్రశ్న

డీఎస్సీ ప్రక్రియలో నాలుగు ప్రధాన అంశాల ద్వారా అక్రమాలు జరిగాయని జగన్‌ ఆరోపించారు. ప్రశ్నపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఒకే వ్యక్తికి అప్పగించడం మొదటి అంశమని అన్నారు. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కే రెండు కీలక బాధ్యతలు ఇవ్వడం వల్ల వ్యవస్థలో పారదర్శకత దెబ్బతిందని పేర్కొన్నారు. మరోవైపు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ప్రక్రియలో కీలక నియంత్రణ లభించిందని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో తొలి ర్యాంకు సాధించిన నవీన్‌ అనే అభ్యర్థిని మెరిట్‌ జాబితా నుంచి తొలగించారని, లాగిన్‌ ఐడీ బ్లాక్‌ చేశారని, కాల్‌ లెటర్‌ ఇవ్వలేదని తెలిపారు. ఈ వ్యవహారంపై అతడు ప్రభుత్వానికి లేఖ రాయడంతో పాటు కోర్టును ఆశ్రయించాడని జగన్‌ వివరించారు.

స్పోర్ట్స్‌ కోటాలో 372 నియామకాలు

స్పోర్ట్స్‌ కోటా పేరుతో తీసుకొచ్చిన జీఓలపైనా జగన్‌ ప్రశ్నలు లేవనెత్తారు. జీఓ నంబర్లు 4, 47 ద్వారా పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు కల్పించారని ఆరోపించారు. ఆ నియామకాలు పూర్తైన తర్వాత జీఓలు 23, 25, 56 తీసుకొచ్చి పరీక్ష తప్పనిసరి చేశారని పేర్కొన్నారు. ఒకే నియామక ప్రక్రియలో మొదట పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చి, తర్వాత పరీక్షను తప్పనిసరి చేయడంపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కొందరు అభ్యర్థులు టెట్‌ వంటి తప్పనిసరి అర్హత పరీక్షలు కూడా రాయకుండానే నియామకాలు పొందారని ఆరోపించారు. ఉద్యోగాల విక్రయానికి సంబంధించిన ఆడియో, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చినా చర్యలు తీసుకోలేదని జగన్‌ అన్నారు.

ఫేక్‌ సర్టిఫికెట్లపై సమగ్ర దర్యాప్తు

స్పోర్ట్స్‌ కోటాలో నకిలీ ధ్రువపత్రాలు వినియోగించారనే ఆరోపణలను కూడా జగన్‌ ప్రస్తావించారు. టీడీపీ నేతల ఆధ్వర్యంలోని కొన్ని క్రీడా సంఘాల నుంచి తప్పుడు సర్టిఫికెట్లు జారీ అయ్యాయని ఆరోపించారు. జరగని క్రీడా పోటీలను జరిగినట్లు చూపించారని, సాఫ్ట్‌బాల్‌, జూడో సంఘాలకు సంబంధించిన సర్టిఫికెట్లపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. కొన్ని జిల్లాల్లో సంఘాల కార్యదర్శులు, వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు దక్కాయనే ఆరోపణలపైనా విచారణ అవసరమన్నారు. మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిగితేనే వాస్తవాలు బయటపడతాయని జగన్‌ పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాల్లో యువతకు న్యాయం జరగాలంటే సీబీఐ విచారణ తప్పనిసరి అని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరారు. ప్రభుత్వం పట్ల నిరుద్యోగుల్లో తిరిగి విశ్వాసం నెలకొనాలంటే నిష్పక్షపాత విచారణ అవసరమని స్పష్టం చేశారు.

 

#YSJaganMohanReddy #APDSC2025 #DSCRecruitment #CBIProbe #TeacherRecruitment #DSCIrregularities #SportsQuota #372Appointments #SportsCertificates #TETEligibility #GovernorAbdulNazeer #YSRCP #NaraLokesh #SAAP #AndhraPradesh