Home AP విశాఖ నీటి ఎద్దడిపై తీవ్ర వ్యాఖ్యలు

విశాఖ నీటి ఎద్దడిపై తీవ్ర వ్యాఖ్యలు

డిజిటల్‌ డైరీలో అన్నీ నమోదు చేయండి.
విశాఖ నేతల భేటీలో వైఎస్ జగన్ .

స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో అధికారులు, పోలీసులు అన్యాయంగా వ్యవహరిస్తే ఘటన జరిగిన వెంటనే వివరాలను డిజిటల్‌ డైరీలో నమోదు చేయాలని పిలుపునిచ్చారు. ఎవరు ఏ విధంగా వ్యవహరించారు? ఏం జరిగింది? ఎలాంటి ఒత్తిళ్లు ఎదురయ్యాయి? వంటి వివరాలను ఆధారాలతో భద్రపరచాలని సూచించారు. భవిష్యత్‌లో ఆ వివరాలను పరిశీలించి చట్టప్రకారం బాధ్యతను నిర్ధారించేలా చర్యలు తీసుకుంటామని జగన్‌ వ్యాఖ్యానించారు. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదని, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు విధులు నిర్వర్తించాలని అన్నారు. డిజిటల్‌ డైరీలో నమోదు చేసిన ప్రతి అంశం భవిష్యత్‌ చర్యలకు ఆధారంగా ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

విశాఖలో నీటి కష్టాలపై ఫోకస్‌

విశాఖపట్నంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని జగన్‌ ఆరోపించారు. మూడు రోజులకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోందని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాతే నగరంలో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే నిర్ణయం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుందని అన్నారు. 45.72 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మిస్తే అదనంగా సుమారు 75 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండేదని జగన్‌ పేర్కొన్నారు. ఆ నీటిని గ్రావిటీ ద్వారా విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అందించే అవకాశం ఉండేదని చెప్పారు. ఒకవైపు అదనపు నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయే పరిస్థితి, మరోవైపు విశాఖ ప్రజలకు మూడు రోజులకోసారి తాగునీరు అందుతున్న పరిస్థితి నెలకొన్నాయని విమర్శించారు.

స్థానిక ఎన్నికలపై పోరాట పిలుపు

విశాఖలో భూముల కేటాయింపులు, డీఎస్సీ నియామకాల్లో అవకతవకల ఆరోపణలు, ఎన్నికల హామీల అమలు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు, వేధింపులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో గట్టిగా నిలబడి పోరాడాలని, ప్రజల్లోకి వెళ్లి తమ వాదనను వివరించాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వ పాలనపై తమ ఆరోపణలను ప్రజల ముందుంచాలని అన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేసిన జగన్‌.. ఎన్నికల సమయంలో జరిగే ప్రతి పరిణామాన్ని నమోదు చేసి భద్రపరచాలని మరోసారి సూచించారు.

 

#YSJaganMohanReddy #Visakhapatnam #VizagWaterCrisis #WaterShortage #DigitalDiary #YSRCP #LocalBodyElections #APPolitics #Polavaram #PolavaramProject #VizagPolitics #AndhraPradesh #YSRCPNews #Jagan #LocalElections