అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతి, గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం కేంద్రాలుగా నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్లకు ఆమోదం లభించింది. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ దృష్ట్యా శాంతిభద్రతల నిర్వహణను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
సోషల్ మీడియా ప్రచారానికి పాలసీ
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఎంప్యానెల్‌మెంట్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి వేదికల కంటెంట్ క్రియేటర్లను గుర్తించి, ధ్రువీకరించి ఏడాది కాలానికి ఎంప్యానెల్ చేయనున్నారు. పనితీరు ఆధారంగా మరో రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది.
రూ.22,177 కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్
ఎస్‌ఐపీబీ సిఫార్సుల మేరకు రూ.22,177.84 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం ఇచ్చింది. వీటితో సుమారు 19,739 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. ఇన్‌ఫ్రా, ఇంధనం, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, పర్యాటక రంగాల్లో ప్రాజెక్టులు రానున్నాయి. అమరావతి మౌలిక వసతులకు రూ.1,548.98 కోట్ల సవరించిన పరిపాలనా అనుమతిని మంజూరు చేశారు. నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, డ్రైనేజీ, రహదారులు, 2,597 వీధి దీపాల పనులు ఇందులో ఉన్నాయి.
ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ బకాయిలు
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు విడతల డీఏ, డీఆర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024 జూలై నుంచి 2.73 శాతం, 2025 జనవరి నుంచి 1.82 శాతం అమలు కానుంది. నగదు చెల్లింపులు 2026 సెప్టెంబర్ వేతనాలతో ప్రారంభం కానున్నాయి. బకాయిలను విడతల వారీగా 2027, 2028లో చెల్లించనున్నారు. ఈ నిర్ణయాలతో ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ.4,556 కోట్ల ఆర్థిక భారం పడనుంది.
#APCabinet #AndhraPradesh #PoliceCommissionerates #Tirupati #Guntur #Kurnool #Rajamahendravaram #APInvestments #Amaravati #SocialMediaPolicy #DAHike #GovernmentEmployees #Pensioners #ChandrababuNaidu #APGovernment











