Home AP ఏడు దశల తనిఖీలా!? డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నల వర్షం

ఏడు దశల తనిఖీలా!? డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నల వర్షం

65 మార్కుల నుంచి 77 మార్కుల దాకా ట్విస్టులు.
చంద్రబాబు వివరణలపై వైఎస్ జగన్‌ విమర్శలు.

డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు ఇస్తున్న వివరణలు ఒక్కోసారి మారుతున్నాయని, ప్రతి కొత్త వివరణ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో మరిన్ని సందేహాలు రేకెత్తిస్తోందని ఆయన ఎక్స్‌ వేదికగా ఆరోపించారు. ఒక అభ్యర్థికి 65 టెట్‌ మార్కుల ఆధారంగా పోస్టు లభించిందని, ఇందుకోసం ఏడు దశల్లో ధ్రువీకరణ ప్రక్రియ జరిగినట్లు చెబుతున్నారని జగన్‌ పేర్కొన్నారు. అయితే అదే అభ్యర్థి అర్హుడు కాదని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) నిర్ధారించినట్లు తెలిపారు. అర్హత లేదని తేల్చే ముందు జరిగిన ఏడు దశల తనిఖీల్లో అసలు ఏ అంశాలను పరిశీలించారనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగం ఎలా వచ్చిందో తనకే తెలియదని అభ్యర్థి చెప్పినట్లు వచ్చిన సమాచారం కూడా మరిన్ని అనుమానాలకు కారణమవుతోందన్నారు.

77 మార్కుల వెనుక అసలు ట్విస్ట్‌

2018లో నిర్వహించిన టెట్‌లో ఆ అభ్యర్థికి 77 మార్కులు వచ్చాయని అధికారులు తాజాగా చెబుతున్నారని జగన్‌ ప్రస్తావించారు. ఆ మార్కులు అప్పటికే రికార్డులో ఉంటే మొదట ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. అదే సమయంలో డీఈఓ ఎందుకు అనర్హుడిగా ప్రకటించారని, వివాదం తెరపైకి వచ్చిన తర్వాతే 77 మార్కుల అంశం ఎందుకు బయటకు వచ్చిందని నిలదీశారు. మరో కీలక అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆ 77 మార్కులు పేపర్‌-II-B (స్కూల్‌ అసిస్టెంట్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) కేటగిరీకి సంబంధించినవని తెలిపారు. కానీ ఎస్‌జీటీ పోస్టుకు అవసరమైన టెట్‌ అర్హత పేపర్‌-I-A కింద ఉండాలని పేర్కొన్నారు. అలాంటప్పుడు ఏడు దశల తనిఖీలను దాటి అభ్యర్థి ఎలా ఎంపికయ్యారన్నది తేల్చాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగం తర్వాత మళ్లీ టెట్‌ ఎందుకు?

ఉద్యోగం పొందిన తర్వాత కూడా అదే అభ్యర్థి 2025లో మరోసారి టెట్‌ పరీక్ష రాశారని జగన్‌ పేర్కొన్నారు. 2018లో వచ్చిన 77 మార్కులే అర్హతకు సరిపోతే, మళ్లీ టెట్‌ రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఈ పరిణామాలన్నింటినీ కలిపి చూస్తే డీఎస్సీ నియామక ప్రక్రియలో పారదర్శకతపై తీవ్ర సందేహాలు తలెత్తుతున్నాయని అన్నారు. “ఇది న్యాయమైన, పారదర్శకమైన ప్రక్రియ అని ఎలా చెప్పగలం? ఈ వ్యవహారం డీఎస్సీ అక్రమాలకు దారితీయలేదా? దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నైతిక బాధ్యత తీసుకోరా?” అంటూ జగన్‌ వరుస ప్రశ్నలు సంధించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 

#JaganMohanReddy #Jagan #ChandrababuNaidu #APMegaDSC #APDSC #DSCVerification #DSCRecruitment #MegaDSC #TeacherRecruitment #APTeacherJobs #TETMarks #65Marks #77Marks #TETPaperIIB #TETPaperIA #SGTRecruitment #DSCControversy #YSRCP #TDP #AndhraPradeshPolitics #APPolitics #APEducation #TeacherJobs #JaganComments