Home AP దక్షిణ ఏపీ పెట్టుబడుల వేట ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలతో లోకేశ్ చర్చలు

దక్షిణ ఏపీ పెట్టుబడుల వేట ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలతో లోకేశ్ చర్చలు

40


ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను భారీ స్థాయిలో ఆకర్షించాలనే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియా పర్యటనలో దూకుడు ప్రదర్శించారు. సియోల్‌లో నిర్వహించిన సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ రోడ్‌షోలో పాల్గొని కొరియా పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఏపీ–కొరియా భాగస్వామ్యం కొత్త దశలోకి అడుగుపెడుతోందని పేర్కొంటూ, పెట్టుబడిదారులతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కియా మోటార్స్ పెట్టుబడి ఏపీపై కొరియా సంస్థలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు.

కొరియా సంస్థలతో కీలక చర్చలు

ఇన్వెస్ట్ కొరియా కమిషనర్ డాక్టర్ కిమ్ టే హ్యుంగ్‌తో నారా లోకేశ్ కీలక సమావేశం నిర్వహించారు. అమరావతి లేదా విశాఖపట్నంలో కోట్రా లేదా ఇన్వెస్ట్ కొరియా కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. దక్షిణ భారతదేశంలో మెట్రో నగరాలకు వెలుపల ఏర్పడే తొలి ఉప ప్రాంతీయ కోట్రా కార్యాలయంగా ఇది నిలుస్తుందని వివరించారు. ఏపీఈడీబీలో ఇప్పటికే పనిచేస్తున్న కోట్రా డెస్క్‌ను దశలవారీగా పూర్తి స్థాయి కార్యాలయంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.

గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి

దక్షిణ కొరియాకు చెందిన డెల్టా ఎక్స్ సంస్థ ప్రతినిధులతో కూడా లోకేశ్ సమావేశమయ్యారు. మెషిన్ విజన్, ఎడ్జ్ ఏఐ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ రంగాల్లో ఉన్న అవకాశాలను చర్చించారు. రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ, 25 గిగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుల లక్ష్యాన్ని వివరించారు. పోర్టు సదుపాయాలు, బలమైన మౌలిక వసతులు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని సంస్థను ఆహ్వానించారు.

షిప్‌బిల్డింగ్ రంగంపై దృష్టి

హెచ్‌డీ కొరియా షిప్‌బిల్డింగ్ అండ్ ఆఫ్‌షోర్ ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులతో కూడా లోకేశ్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో సముద్ర రవాణా, షిప్‌బిల్డింగ్, ఆఫ్‌షోర్ ఇంజనీరింగ్ రంగాలకు ఉన్న అవకాశాలను వివరించారు. ప్రపంచ స్థాయి పరిశ్రమలు స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పారిశ్రామిక విధానాన్ని సంస్థ ప్రతినిధులకు వివరించారు.

ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు ఆహ్వానం

షిన్‌హ్యుప్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఛైర్మన్ టేహూ కిమ్‌తో సమావేశమైన లోకేశ్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎండ్ టు ఎండ్ పీసీబీ క్లస్టర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఏపీని పెట్టుబడి గమ్యస్థానంగా ఎంచుకున్నందుకు సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.

ఈవీ, గృహోపకరణాల రంగాలకు ఆహ్వానం

మోటివ్ లింక్ సంస్థ ప్రతినిధులతో సమావేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల తయారీ యూనిట్‌ను శ్రీసిటీలో ఏర్పాటు చేయాలని నారా లోకేశ్ కోరారు. అనంతరం కుకూ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులతో సమావేశమై శ్రీసిటీ లేదా తిరుపతిలో గృహోపకరణాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. ఇప్పటికే దేశంలో 40 శాతం ఎయిర్ కండీషనర్లు, 35 శాతం టెలివిజన్లు ఆంధ్రప్రదేశ్‌లో తయారవుతున్నాయని గుర్తుచేశారు. దక్షిణ కొరియా పర్యటనలో వరుస సమావేశాల ద్వారా ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా నిలబెట్టే దిశగా నారా లోకేశ్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు.