Home AP ఏపీకి గ్రీన్ ఎనర్జీ.. భారీ పెట్టుబడులు!

ఏపీకి గ్రీన్ ఎనర్జీ.. భారీ పెట్టుబడులు!

పునరుత్పాదక రంగంలో నంబర్ వన్ లక్ష్యం.

ఆంధ్రప్రదేశ్‌ను పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లు మండలం హులికెరలో సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. సుజ్లాన్ సంస్థ అనంతపురం జిల్లాలో రూ.10 వేల కోట్ల పెట్టుబడితో 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 4 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. ఇప్పటికే సుజ్లాన్‌కు ఏపీలో 1,700 మెగావాట్లకు పైగా స్థాపిత సామర్థ్యం ఉందని, 2030 నాటికి మరో 5 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే ప్రణాళికతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

స్థానిక యువతకే ఉద్యోగాల్లో ప్రాధాన్యం

అనంతపురంలోని సుజ్లాన్ ప్లాంట్ విస్తరణతో పాటు ఉరుకొండలోని బ్లేడ్ల తయారీ యూనిట్ విస్తరణ, కొత్త ప్రాజెక్టుల ద్వారా సుమారు 4,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని లోకేశ్ తెలిపారు. 2016లో ప్రారంభమైన సుజ్లాన్ ప్లాంట్ ఇప్పటికే దాదాపు 2,000 మందికి ఉపాధి కల్పించిందని, వారిలో సుమారు 70 శాతం మంది స్థానిక యువత ఉన్నారని చెప్పారు. స్థానిక ఐటీఐలను దత్తత తీసుకుని శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. సుజ్లాన్ ఉద్యోగుల్లో 40 శాతం మంది మహిళలు ఉండటం అభినందనీయమన్నారు. తిరుపతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పెట్టుబడులు వేగంగా అమలయ్యేలా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పరిశ్రమల సమస్యల పరిష్కారానికి పారిశ్రామికవేత్తలు, అధికారులతో నెలవారీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రత్యేక అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

 

#AndhraPradesh #GreenEnergy #RenewableEnergy #NaraLokesh #Suzlon #WindPower #Anantapur #CleanEnergy #RenewableEnergyProjects #WindEnergy #Investment #GreenEnergyInvestment #LocalJobs #APDevelopment #AndhraPradeshNews