Home AP రోడ్డుపై కాదు.. సభలోనే ప్రశ్నించండి

రోడ్డుపై కాదు.. సభలోనే ప్రశ్నించండి


అసెంబ్లీకి రండి.. ప్రజా సమస్యలు మాట్లాడండి
జగన్‌కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు పిలుపు

ఏపీ అసెంబ్లీ సమావేశాలను అర్థవంతమైన చర్చలకు వేదికగా మార్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తెలిపారు. వరలక్ష్మీ వ్రతం నేపథ్యంలో సెలవు అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నాలుగు రోజుల సమావేశాల్లోనే బిల్లులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. సభను అనవసర ఆందోళనలు, నిరసనలకు వేదికగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తే అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. అన్ని పార్టీలకు అసెంబ్లీ సమానమైన వేదిక అని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు బయట రోడ్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని ప్రస్తావిస్తూ “అసెంబ్లీకి రండి.. మీకు ఉన్న సందేహాలను సభలో అడగండి.. మంత్రులు సమాధానం ఇస్తారు” అని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చి ప్రజా సమస్యలను ప్రస్తావించాలని కోరారు. ప్రభుత్వం తప్పు చేస్తే సభలో నిలదీసే హక్కు ప్రతిపక్షానికి ఉందని, సంబంధిత మంత్రులతో సమాధానం ఇప్పించే బాధ్యత స్పీకర్‌గా తాను తీసుకుంటానని అయ్యన్న చెప్పారు.

ప్రతిపక్ష హోదా నిబంధనల ప్రకారమే

వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న డిమాండ్‌పైనా స్పీకర్‌ స్పష్టత ఇచ్చారు. ప్రతిపక్ష హోదా సంఖ్యాబలంపై ఆధారపడి ఉంటుందని, నిబంధనలకు అనుగుణంగానే నిర్ణయం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని గుర్తుచేశారు. గతంలో చంద్రబాబు 23, 24 సీట్లు గెలిచిన సమయంలో జగన్‌ చేసిన వ్యాఖ్యలను కూడా అయ్యన్న ప్రస్తావించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌పై మాజీ మంత్రులు చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. క్వార్టర్స్‌ ఇంకా ప్రారంభించకముందే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ ఎలా ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు కుటుంబాలతో నివసించేందుకు క్వార్టర్స్‌ నిర్మించామని, చిన్నచిన్న పనులు పూర్తయిన తర్వాత వాటిని సభ్యులకు కేటాయిస్తామని చెప్పారు. శాసనసభ, ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వ్యవస్థను కించపరిచేలా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే అవసరమైతే చట్టపరమైన చర్యలకు వెనుకాడబోనని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు.

 

#AyyannaPatrudu #APAssembly #AndhraPradeshAssembly #APPolitics #JaganMohanReddy #YSRCP #YSJagan #AssemblySessions #APAssemblySessions #PublicIssues #Opposition #AndhraPradeshPolitics #Amaravati #PoliticalNews