Home AP ఏపీలో ఎల్‌నినో ఎఫెక్ట్‌ చంద్రబాబు కీలక ఆదేశాలు

ఏపీలో ఎల్‌నినో ఎఫెక్ట్‌ చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 50.7 శాతం వర్షపాతం లోటు నమోదైందని చెప్పారు. ఖరీఫ్‌లో 30.84 లక్షల హెక్టార్ల సాగు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 79 శాతం విస్తీర్ణంలో మాత్రమే సాగు ప్రారంభమైందని వెల్లడించారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, మధ్యకాలిక కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

నిత్యావసర ధరలపై ప్రత్యేక దృష్టి

ఎల్‌నినో ప్రభావం వ్యవసాయానికే పరిమితం కాకుండా ఇతర రంగాలపై కూడా పడే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు. బియ్యం, ఉల్లి, పామాయిల్‌, కందిపప్పు ధరలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోదాముల్లోని బియ్యం నిల్వలను పరిశీలించి అవసరమైనప్పుడు మార్కెట్‌లోకి విడుదల చేయాలని సూచించారు. భవిష్యత్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఉల్లి సాగును ప్రోత్సహించాలని చెప్పారు. స్వయం సహాయక సంఘాల ద్వారా కిచెన్‌ గార్డెన్లను విస్తరించి కూరగాయల ఉత్పత్తి పెంచాలని సూచించారు. మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, మెట్ట పంటలు, ప్రకృతి వ్యవసాయాన్ని రైతులు చేపట్టేలా ప్రోత్సహించాలని అన్నారు.

రైతులు.. పశువులకు రక్షణ చర్యలు

ఖరీఫ్‌ అత్యవసర ప్రణాళిక కోసం రూ.60 కోట్లు సిద్ధంగా ఉంచామని చంద్రబాబు తెలిపారు. 80 శాతం సబ్సిడీతో 1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందించామని చెప్పారు. ఉద్యాన పంటలను కాపాడేందుకు అధిక ప్రమాద ప్రాంతాల్లో రూ.190 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం సకాలంలో అందేలా చూడాలని ఆదేశించారు. ప్రజలకు తాగునీరు, పశువులకు నీరు, మేత అందుబాటులో ఉండాలని సూచించారు. హంద్రీ-నీవా ద్వారా చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు చేరేలా చర్యలు చేపట్టామని, 100 రోజుల్లో కాలువల్లోకి నీరు తీసుకొచ్చేందుకు రూ.3,500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులు, ప్రజాప్రతినిధులు, సాగునీటి సంఘాలతో సమన్వయం చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

 

#ElNino #AndhraPradesh #APDrought #RainfallDeficit #ChandrababuNaidu #APFarmers #APAgriculture #Kurnool #Nandyal #Anantapur #KharifSeason #FarmerRelief #HandriNeeva #DroughtManagement #AndhraPradeshNews