కోవూరులో కూటమి గెలుపుకు లోకేశ్ పిలుపు.
నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా కోవూరులో టీడీపీ కార్యకర్తలు, నేతల సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విజయం దక్కేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. వారు కుల, మతాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నాలు చేస్తారని ఆరోపించారు. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు. నెల్లూరులో తనకు లభించిన స్వాగతాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన సమయంలో తొలి కార్యకర్తగా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన బెజవాడ పాపిరెడ్డి ఉన్నారని గుర్తుచేశారు. ప్రజాసేవ లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన వీపీఆర్ దంపతులను లోకేశ్ ప్రశంసించారు. టీడీపీ మహిళలను గౌరవిస్తుందని చెబుతూ, వైఎస్ భారతి గురించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన సొంత పార్టీ వారిపైనా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యకర్తే పార్టీకి అధినేత అని స్పష్టం చేశారు.
2029లోనూ కూటమి కలిసే పోటీ
2029 ఎన్నికల్లోనూ కూటమి కలిసి పోటీ చేస్తుందని లోకేశ్ ప్రకటించారు. ఎన్నికల్లో విజయం సాధిస్తేనే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఎన్డీయే జెండా ఎగరాలన్న లక్ష్యంతో పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ నూటికి నూరు శాతం విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోవూరు నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత బలం మరింత పెంచుకోవడం, స్థానిక స్థాయిలో సమన్వయంతో ముందుకు సాగడమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు సూచించారు.
సంక్షేమం, అభివృద్ధితో ముందుకు
రాష్ట్రంలో 45 వేల మంది కార్యకర్తలు కోటి 60 లక్షల ఇళ్లకు ‘గడప గడపకు’ వెళ్లారని లోకేశ్ తెలిపారు. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాలని సూచించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు జోడెద్దుల్లా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాయని అన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులకు ఏపీ వేదికగా మారుతోందని పేర్కొన్నారు. డీఎస్సీ విషయంలో వైసీపీపై విమర్శలు చేసిన లోకేశ్.. ఐదేళ్ల పాటు డీఎస్సీని పట్టించుకోని వారు ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని వారు కూడా తనను ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. డీఎస్సీపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. కూటమి ప్రభుత్వంపై జరిగే ప్రతి కుట్రను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
#NaraLokesh #TDP #NDA #TDPAlliance #JanaSena #BJP #2029Elections #APPolitics #Kovur #NellorePolitics #LocalBodyElections #AndhraPradesh #TDPNews #NaraLokeshNews











