నాన్న మీద ఒట్టు.. పులివెందుల గెలుపు కోసం పట్టు.
కోట ఎవరిది? జెండా ఎవరిది? కడప గడ్డపై ఇప్పుడు వినిపిస్తున్న అసలు ప్రశ్న ఇదే. పులివెందులలో జరగబోయే మున్సిపల్ ఎన్నిక.. సాధారణ స్థానిక పోరుగా కనిపించినా, దాని వెనుక దాగి ఉన్న రాజకీయ పందెం చాలా పెద్దది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి అప్రతిహత రాజకీయ కేంద్రంగా నిలిచిన పులివెందులలో ఈసారి అధికార కూటమి బలంగా సవాల్ విసురుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఇది కేవలం ఒక ఎన్నిక కాదు.. తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి నిర్మించిన రాజకీయ వారసత్వంపై తన పట్టు ఇంకా కొనసాగుతోందని చాటిచెప్పాల్సిన పరీక్ష. మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి ఇది ప్రత్యర్థి గడప వరకు చేరిన తమ రాజకీయ విస్తరణను నిరూపించుకునే అవకాశం. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ ఎదుర్కొన్న రాజకీయ దెబ్బల నేపథ్యంలో పులివెందులలో వచ్చే ఫలితం జగన్ నాయకత్వానికి కొత్త ఊపునిస్తుందా? లేక వైఎస్ కుటుంబ కంచుకోటపై ప్రత్యర్థుల జెండా ఎగరేసే తొలి సంకేతంగా మారుతుందా? అన్న ఉత్కంఠ నెలకొంది. కుప్పంలో సాధించిన విజయాన్ని చూపిస్తూ పులివెందులలోనూ పాగా వేస్తామని కూటమి చెబుతోంది. మరోవైపు పులివెందుల తనదేనని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ పోరు వార్డుల కోసం కాదు.. రాజకీయ ప్రతిష్ఠ కోసం. ఫలితం ఒక మున్సిపాలిటీ భవిష్యత్తును మాత్రమే కాదు.. కడప రాజకీయాల తదుపరి దిశను కూడా సూచించే అవకాశం ఉంది.
#PulivendulaMunicipalElections #YSJagan #PulivendulaPolitics #YSRCP #TDP #JanaSena #BJP #KadapaPolitics #YSFamily #AndhraPradeshPolitics #MunicipalElections #Jagan











