అంతర్జాతీయ స్థాయికి రెడ్ బుక్ పాలన .
ప్రజాస్వామ్యానికి ముప్పున్న వైఎస్ జగన్ .
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి వివాదానికి వేదికైంది. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల సోషల్ మీడియా పోస్టులను బ్లాక్ చేసేందుకు ఏపీ పోలీసులు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ పేరును వాడారనే వార్త తీవ్ర దుమారం రేపుతోంది. చంద్రబాబు పాలనలో ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అంతర్జాతీయ స్థాయికి చేరిందని జగన్ విమర్శించారు. ఒక విదేశీ దర్యాప్తు సంస్థ పేరుతో నకిలీ గుర్తింపును వాడటం ప్రజాస్వామ్యానికే పెను ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చట్టబద్ధమైన పోలీసింగ్ కాదని, కేవలం రాజకీయ కక్షసాధింపు కోసం ప్రభుత్వం చేస్తున్న మోసమని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఈ తప్పుడు చర్యల వల్ల రాష్ట్రంతో పాటు దేశ ప్రతిష్ట తీవ్రంగా దిగజారిపోతోందని హెచ్చరించారు.
పోలీసు వ్యవస్థ విశ్వసనీయతకు భంగం
ఈ ఈమెయిల్ అభ్యర్థన అధికారిక ఏపీ పోలీసు ఐడీ నుంచే వచ్చినట్లు ఎక్స్ సంస్థ ధృవీకరించిందని జగన్ పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో విమర్శకుల గొంతు నొక్కడానికి విదేశీ ఏజెన్సీ పేరును దుర్వినియోగం చేయడం పోలీసు వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. పోలీసు యూనిఫాం ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మాత్రమే ఉన‍్నదని, ప్రభుత్వ రాజకీయ సెన్సార్‌షిప్‌ను అమలు చేయడానికి కాదని ఆయన తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో విమర్శలను అణచివేసేందుకు ఉపయోగిస్తున్న శక్తిని హామీల అమలుపై పెట్టాలని ప్రభుత్వంకు సూచించారు. నెరవేరని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు, డీఎస్సీ అక్రమాలు, అమరావతి దోపిడీ, పెరుగుతున్న అప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి చర్యలని మండిపడ్డారు. కరువులో ఉన్న రైతులకు అండగా నిలవడం, యువతకు ఉద్యోగాలు కల్పించడంపై దృష్టి సారించాలని, పారదర్శకమైన పాలనతోనే విమర్శలకు సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు.











