ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు… దర్యాప్తులో తేలిన మాజీ ట్రస్టీ లీలలు

58
  • రామాలయం ఉద్యోగాల్లో కమిషన్ల దందా
  • విచారణలో దొరికిన మాజీ ట్రస్టీ

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు దర్యాప్తు ముదురుతున్న కొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ స్కామ్‌లో రామాలయ ట్రస్ట్ మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుడు అవినాష్ మిశ్రాను విచారించగా.. అనిల్ మిశ్రా పేరును పలుమార్లు ప్రస్తావించినట్లు సమాచారం. ఈ వివాదం కారణంగానే అనిల్ మిశ్రా, జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ గత వారం తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరిని ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే సుదీర్ఘంగా ప్రశ్నించింది.

బంధువులకు పైరవీలు.. కోట్ల ఆస్తులు
ఆలయంలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులు అనిల్ మిశ్రా సిఫార్సుతోనే ఉద్యోగాలు పొందినట్లు విచారణలో తేలింది. కనీసం 125 మంది సిబ్బంది ఆయన రికమండేషన్‌తోనే కొలువులు సాధించగా.. అందులో కొందరు ఆయన సొంత బంధువులు కూడా ఉన్నారు. ఈ ఉద్యోగాల నియామకాల కోసం అనిల్ మిశ్రా భారీగా కమిషన్లు తీసుకున్నారనే ఆరోపణలపై సిట్ దృష్టి సారించింది. ఆయన ట్రస్టీ అయిన తర్వాత ఆస్తులు ఎంత పెరిగాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన పలు ఆస్తులను అధికారులు గుర్తించారు.

సీసీటీవీల కళ్లుగప్పి నగదు మాయం
ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు లవకుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రాలు అనిల్ మిశ్రాకు దగ్గరి బంధువులని తెలుస్తోంది. ట్రస్ట్ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం వల్ల వీరికి ఆలయంలో ఎదురే లేకుండా పోయింది. విరాళాల లెక్కింపు గది తాళాలు ఉండే తిన్ను యాదవ్ అనే నిందితుడు వీరికి దొంగతనం సులువుగా మారేలా సహకరించాడు. కెమెరాల కళ్లు గప్పడానికి వీరంతా ఒక ప్లాన్ ప్రకారం వ్యవహరించేవారు. ఒకరు డబ్బు తీసుకుంటుంటే మిగిలిన వారు చుట్టూ నిలబడి కెమెరాలకు అడ్డుగా ఉండేవారు. ఆ సొమ్మును బాత్‌రూమ్‌లో దాచి ఆ తర్వాత బయటకు తరలించేవారు. ఈ లూటీలో బ్యాంకు సిబ్బంది వాటా కూడా ఉన్నట్లు సమాచారం.

 

#AyodhyaRamMandir #RamMandir #DonationScam #TempleFunds #Ayodhya #AnilMishra #Corruption #SITInvestigation #CrimeNews #BreakingNews #IndiaNews #TempleAdministration #RecruitmentScam #Trust #LawEnforcement #LatestNews #TeluguNews #Investigation #RamTemple #Fraud