స్పందించిన వాట్సాప్
హైప్రొఫైల్ పేర్లకు రక్షణ
కేంద్రం వ్యక్తం చేసిన ఆందోళనలపై వాట్సాప్ స్పందించింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సంస్థలు, ప్రముఖుల పేర్లను సాధారణ వినియోగదారులు తీసుకోకుండా ముందుగానే రిజర్వ్ చేసినట్లు వెల్లడించింది. అసలు పేర్లను పోలి ఉండే యూజర్‌నేమ్స్‌కూ అనుమతి ఇవ్వబోమని తెలిపింది. చట్టబద్ధమైన యజమానులు మాత్రమే అలాంటి పేర్లను పొందేలా ప్రత్యేక వ్యవస్థ రూపొందించినట్లు వివరించింది.
భద్రతకు పలు రక్షణ చర్యలు
యూజర్‌నేమ్స్ ఫీచర్ వచ్చినా ప్రతి ఖాతాకు మొబైల్ నంబర్ తప్పనిసరిగా కొనసాగుతుందని వాట్సాప్ స్పష్టం చేసింది. నకిలీ ఖాతాలు, మోసాలను గుర్తించే ప్రత్యేక వ్యవస్థలు పనిచేస్తాయని తెలిపింది. కొత్తగా సృష్టించిన ఖాతాలు ఒకేసారి ఎక్కువ మందికి సందేశాలు పంపకుండా పరిమితులు ఉంటాయని వెల్లడించింది. ఖచ్చితమైన యూజర్‌నేమ్ తెలిసిన వారే సందేశం పంపగలరని పేర్కొంది. కొత్త ఖాతా వివరాలు, ఉమ్మడి గ్రూపులు, దేశ సమాచారం కూడా వినియోగదారులకు కనిపించేలా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వివరించింది.
కేంద్రం తుది నిర్ణయం తర్వాతే అమలు
యూజర్‌నేమ్స్ ఫీచర్ వల్ల ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్, నకిలీ గుర్తింపులతో జరిగే నేరాలు పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే మెటా సమాధానాలు, భద్రతా చర్యలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనుంది. వినియోగదారుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత మాత్రమే ఈ కొత్త ఫీచర్‌కు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.











