Home Others స్టాక్‌ మార్కెట్‌లో భారీ విలయం

స్టాక్‌ మార్కెట్‌లో భారీ విలయం

ఆరు నెలల కనిష్ఠానికి సెన్సెక్స్‌.
ఏడున్నర లక్షల కోట్ల సంపద ఆవిరి.

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో భారీ అమ్మకాలు కొనసాగాయి. సోమవారం సెన్సెక్స్‌ 1,124 పాయింట్లు పడిపోయి 72,771.72కు చేరింది. ఇది మార్చి 30 తర్వాత అత్యల్ప ముగింపు. నిఫ్టీ 360 పాయింట్లు కోల్పోయి 22,780.25 వద్ద ముగిసింది. ఒక్కరోజులోనే పెట్టుబడిదారుల సంపద రూ.7.52 లక్షల కోట్లు ఆవిరైంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 29 నష్టాల్లో ముగిశాయి.

నెలలో రూ.17.17 లక్షల కోట్ల నష్టం

ఆగస్టు 27 నుంచి నెల రోజుల్లో సెన్సెక్స్‌ 5.40 శాతం, నిఫ్టీ 5.44 శాతం పతనమయ్యాయి. దీంతో పెట్టుబడిదారుల సంపద ఏకంగా రూ.17.17 లక్షల కోట్లు తగ్గి రూ.474.36 లక్షల కోట్లకు చేరింది. పెరుగుతున్న ముడిచమురు ధరలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. శుక్రవారం ఒక్కరోజే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.3,693.93 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

చమురు మంట.. మార్కెట్‌కు దెబ్బ

అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలు కొనసాగడంతో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు సుమారు 108 డాలర్లకు చేరడం ఆందోళన పెంచింది. అమెరికా 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌ 5.2 శాతానికి చేరడం కూడా విదేశీ నిధులపై ప్రభావం చూపుతోంది. నిపుణుల ప్రకారం, అధిక చమురు ధరలు, బలమైన డాలర్‌, విదేశీ నిధుల తరలింపు మార్కెట్‌ పతనానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. సమీప కాలంలో మార్కెట్‌లో అస్థిరత కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

 

#StockMarket #Sensex #Nifty #StockMarketCrash #ShareMarket #IndianStockMarket #InvestorWealth #MarketFall #FIISelling #CrudeOil #WestAsiaTensions #MarketVolatility