ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సిస్కో ఇండియా, సౌత్ఈస్ట్ ఏషియా ఎండీ హరీశ్ కృష్ణన్‌తో చర్చించిన లోకేశ్.. రాష్ట్రంలో యూనిఫైడ్ కంప్యూటింగ్ సిస్టమ్ సర్వర్లు, స్విచ్‌లు, రౌటర్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. విశాఖపట్నంలో ఇంజినీరింగ్ సెంటర్ లేదా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఏపీలో ఇప్పటికే 50 వేల మంది యువతకు సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ ద్వారా శిక్షణ కార్యక్రమం కొనసాగుతోందని హరీశ్ కృష్ణన్ తెలిపారు. విశాఖ ఇన్నోవేషన్ సెంటర్, తిరుపతి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, విజయవాడ స్మార్ట్ సిటీ, ఏపీ ఫైబర్‌నెట్‌లో సిస్కో భాగస్వామ్యాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కొత్త ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు.
మెడికల్ పరికరాలు, ఫిన్‌టెక్‌పై దృష్టి
వివో ఇండియా అధ్యక్షుడు అరిత్జిత్ సేన్‌తో భేటీలో తిరుపతిలో మొబైల్ విడిభాగాల తయారీ కేంద్రం, సరఫరాదారుల కోసం కాంపొనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని లోకేశ్ కోరారు. అబాట్ ఇండియా ఎండీ ఇష్తేయాక్ అమ్జాద్‌తో చర్చల్లో ఏపీ మెడ్‌టెక్ జోన్ లేదా ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లో వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని సూచించారు. నక్కపల్లిలోని బల్క్ డ్రగ్ పార్కులో ఔషధ తయారీ యూనిట్, విశాఖలో అబాట్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. పెట్టుబడులపై పరిశీలన చేస్తామని అబాట్ ప్రతినిధి తెలిపారు.
విశాఖకు టెక్నాలజీ హబ్ ప్రతిపాదన
మాస్టర్‌కార్డ్ ఉపాధ్యక్షుడు అభిషేక్ లాహిరితో సమావేశమైన లోకేశ్ విశాఖపట్నంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ లేదా టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో ఫిన్‌టెక్ సలహాదారుగా చేరి స్టార్టప్‌లకు మార్గదర్శకత్వం అందించాలని ప్రతిపాదించారు. ఏపీ పర్యాటక ప్రదేశాలను ‘ప్రైస్‌లెస్’ వేదిక ద్వారా ప్రచారం చేసేందుకు ఏపీ టూరిజం అథారిటీతో మాస్టర్‌కార్డ్ ఒప్పందం చేసుకున్నట్లు లాహిరి తెలిపారు. రాష్ట్ర ప్రతిపాదనలను కంపెనీ ఉన్నతాధికారులతో చర్చిస్తామని చెప్పారు. అనంతరం శాప్, గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్, యారా ఇంటర్నేషనల్ ప్రతినిధులతోనూ లోకేశ్ సమావేశమై పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు.
#NaraLokesh #AndhraPradesh #APInvestments #Cisco #VivoIndia #AbbottIndia #Mastercard #Visakhapatnam #Tirupati #APMedTech #FinTech #Manufacturing #GlobalCapabilityCentre #IndustrialDevelopment #AndhraPradeshNews











