Home National_news ఇంజిన్ డామేజ్ నిజమా? ఈ20 పెట్రోల్‌పై అపోహలు

ఇంజిన్ డామేజ్ నిజమా? ఈ20 పెట్రోల్‌పై అపోహలు

86
  • కేంద్రం 10 కీలక వివరణలు
  • ప్రమాదంలో వెహికల్స్ ప్రచారం
  • అంతా ఉత్తదే అంటున్న కేంద్రం

ఈ 20 పెట్రోల్‌పై సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అపోహలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇంధనంలో 20 శాతం ఇథనాల్ కలిపే ఈ20 కార్యక్రమంపై వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ 10 అంశాలతో కూడిన సమగ్ర వివరణ విడుదల చేసింది. శాస్త్రీయ అధ్యయనాలు, అంతర్జాతీయ అనుభవం, నియంత్రణ ప్రమాణాల ఆధారంగానే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేసింది.

ఇథనాల్ తయారీకి వేల లీటర్ల నీరు అవసరమనే ప్రచారం తప్పు

ఒక లీటర్ ఇథనాల్ తయారీకి 10 వేల లీటర్ల నీరు అవసరమని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఆహార భద్రతకు అవసరమైన నిల్వలు మిగిలిన తర్వాత మాత్రమే అదనపు బియ్యాన్ని ఇథనాల్ తయారీకి వినియోగిస్తున్నామని తెలిపింది. ఒక్కో లీటర్ ఇథనాల్ తయారీకి కేవలం 3 నుంచి 5 లీటర్ల శుద్ధి చేసిన నీరు మాత్రమే ఉపయోగిస్తారని, చాలా పరిశ్రమలు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానంతో నీటిని తిరిగి వినియోగిస్తున్నాయని వెల్లడించింది.

ఇంజిన్ దెబ్బతింటుందనే వాదనలో నిజం లేదు

ఈ20 పెట్రోల్ వల్ల వాహన ఇంజిన్లు దెబ్బతింటాయనే ప్రచారాన్ని కూడా కేంద్రం తిరస్కరించింది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ నిర్వహించిన పరీక్షల్లో ఇంజిన్ పనితీరుపై ప్రతికూల ప్రభావం కనిపించలేదని తెలిపింది. పాత వాహనాల్లో కొన్ని రబ్బరు భాగాలను ముందుగానే మార్చాల్సిన అవసరం ఉండొచ్చని మాత్రమే పేర్కొంది.

ఈ20 కొత్త ఇంధనం కాదని స్పష్టీకరణ

ఇథనాల్ మిశ్రమ ఇంధనం కొత్త ప్రయోగం కాదని కేంద్రం తెలిపింది. అమెరికా, బ్రెజిల్, కెనడా, థాయ్‌లాండ్, జపాన్, పలు యూరోప్ దేశాల్లో దశాబ్దాలుగా ఇథనాల్ మిశ్రమ ఇంధనం వినియోగంలో ఉందని గుర్తుచేసింది. భారత్‌లో కూడా విస్తృత పరీక్షల తర్వాతే ఈ20ను అమలు చేశామని పేర్కొంది. ఈ 20 పెట్రోల్ వాడితే వాహన వారంటీ, బీమా రద్దవుతాయనే ప్రచారాన్ని కేంద్రం పూర్తిగా ఖండించింది. ఈ20కు అనుకూలంగా రూపొందించిన లేదా ఆమోదం పొందిన వాహనాలకు వారంటీ, బీమా యథావిధిగా వర్తిస్తాయని వాహన తయారీ సంస్థలు, బీమా సంస్థలు స్పష్టం చేశాయని తెలిపింది.

చీమలు, తేనెటీగలు వస్తాయనే ప్రచారం కూడా అవాస్తవమే

ఈ20లో చక్కెర ఉండటంతో చీమలు, తేనెటీగలు ఆకర్షితమవుతాయనే వైరల్ పోస్టులను కూడా కేంద్రం తప్పుబట్టింది. ఇంధన గ్రేడ్ ఇథనాల్ తయారీ సమయంలో చక్కెర పూర్తిగా తొలగిపోతుందని, పురుగులను దూరంగా ఉంచే పదార్థాలు అందులో కలుపుతారని వివరించింది. ఈ20 కార్యక్రమం వల్ల విదేశీ మారకద్రవ్యంలో రూ.1.9 లక్షల కోట్లకు పైగా ఆదా జరిగిందని కేంద్రం వెల్లడించింది. రైతులకు రూ.1.6 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయని తెలిపింది. కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు సుమారు 930 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గాయని, 310 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ముడి చమురు దిగుమతులు తగ్గినట్లు పేర్కొంది. 2025 డిసెంబర్‌లోనే 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని భారత్ ముందుగానే సాధించిందని, ప్రస్తుతం దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం 2,000 కోట్ల లీటర్లకు చేరిందని కేంద్రం వెల్లడించింది.

 

#E20Petrol #EthanolBlending #Petrol #Ethanol #GovernmentOfIndia #PetroleumMinistry #Fuel #FactCheck #AutoNews #VehicleSafety #EngineSafety #MythVsFact #GreenFuel #RenewableEnergy #Farmers #CarbonEmission #IndiaNews #BreakingNews #LatestNews #TeluguNews