Home General బోర్న్‌విటాపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా

బోర్న్‌విటాపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా

తప్పుడు క్లెయిమ్‌లపై కంపెనీలకు షాక్.
ఇన్నాళ్లూ తాగిన బోర్న్‌విటా కథ ఇదేనా?

చిన్నప్పటి నుంచి ఇంట్లో కనిపించిన బోర్న్‌విటా.. పిల్లలకు బలం, ఆరోగ్యం ఇస్తుందనే నమ్మకంతో తాగిన వాళ్లు ఇప్పుడు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. “ఇన్నాళ్లూ తాగిన బోర్న్‌విటా కథ ఇదేనా?” అంటూ జనం విస్తుపోతున్నారు. ఆరోగ్యం కోసం ఇస్తున్నామని భావించిన ఉత్పత్తిపైనే తప్పుడు క్లెయిమ్‌ల ఆరోపణలు రావడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. పిల్లల ఆరోగ్యం, పోషక విలువలు, బలం అంటూ జరిగిన ప్రచారంపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా ఝళిపించడంతో అసలు కథ బయటకు వస్తోందా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. సంస్థ కూడా వెనక్కి తగ్గి.. అభ్యంతరాలు వచ్చిన ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువల పోలికలకు సంబంధించిన క్లెయిమ్‌లను ఉపసంహరించుకుంది. ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఆ ప్రకటనలను తొలగించింది. అంతేకాదు.. బోర్న్‌విటాతో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు దేశంలోని పెద్ద పెద్ద ఫుడ్‌ బ్రాండ్ల తలుపు తట్టింది. 150కి పైగా కంపెనీలకు నోటీసులు వెళ్లడం చూస్తే.. ఇన్నాళ్లూ మనం నమ్మిన ఫుడ్‌ యాడ్స్‌లో అసలు ఎంత నిజం ఉందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది.


ఆహార ఉత్పత్తులపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు పోషక క్లెయిమ్‌లకు వ్యతిరేకంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చర్యలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో బోర్న్‌విటా తయారీ సంస్థ మోండెలీజ్‌ ఇండియా ఫుడ్స్‌ కీలక మార్పులు చేసింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అభ్యంతరం తెలిపిన ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువల పోలికలకు సంబంధించిన క్లెయిమ్‌లను సంస్థ ఉపసంహరించుకుంది. వాటికి సంబంధించిన ప్రకటనలను ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల నుంచి కూడా తొలగించింది. పిల్లలను లక్ష్యంగా చేసుకున్న బోర్న్‌విటా మార్కెటింగ్‌పై 2023లోనే చర్చ మొదలైంది. ముఖ్యంగా చక్కెర శాతం, పోషక విలువలపై చేసిన ప్రచారం అప్పట్లో పరిశీలనకు వచ్చింది. తాజాగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఇచ్చిన నోటీసు తర్వాత సంస్థ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

150కి పెద్ద బ్రాండ్లపైనా నియంత్రణ

బోర్న్‌విటాతో ఆగకుండా దేశవ్యాప్తంగా ఆహార కంపెనీల ప్రకటనలు, లేబులింగ్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తనిఖీలు పెంచింది. తప్పుదారి పట్టించే ప్రకటనలు, తప్పుడు క్లెయిమ్‌లు, లేబులింగ్‌ నిబంధనల ఉల్లంఘనలపై 150కి పైగా నోటీసులు జారీ చేసింది. నెస్లే ఇండియా, పెప్సికో, కోకాకోలా ఇండియా, అబ్బాట్‌ ఇండియా, రెడ్‌బుల్‌ ఇండియా, డానోన్‌ ఇండియా, మాన్‌స్టర్‌ ఎనర్జీ ఇండియా, ఫెర్రెరో ఇండియా, కెన్‌వ్యూ వంటి సంస్థలు కూడా ఈ చర్యల పరిధిలోకి వచ్చాయి. అమ్వే ఇండియా తన కొబ్బరి నూనె ప్యాకేజింగ్‌ నుంచి “100%” అనే పదాన్ని తొలగించింది. ఎక్స్‌ఎస్‌ కేఫీన్‌ ఉత్పత్తులపై ఉన్న “ఎనర్జీ డ్రింక్” పదాన్ని కూడా తొలగించింది. కేరళకు చెందిన జూజా ఫుడ్స్‌ కూడా బేబీ ఫుడ్‌పై “రోగనిరోధక శక్తిని పెంచుతుంది”, “ఎముకలను బలపరుస్తుంది” వంటి క్లెయిమ్‌లను ఉపసంహరించుకునేందుకు అంగీకరించింది.

100% క్లెయిమ్‌లకు చెక్

ఆహార ఉత్పత్తులపై 100% అనే పదాన్ని ఉపయోగించవద్దని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 2025 మేలోనే సూచించింది. ఈ పదం ఉత్పత్తి సంపూర్ణంగా స్వచ్ఛమైనదని లేదా ఇతర ఉత్పత్తుల కంటే మెరుగైనదని వినియోగదారులకు భావన కలిగించే అవకాశం ఉందని నియంత్రణ సంస్థ పేర్కొంది. ఇప్పుడు ఈ నిబంధనల అమలును మరింత కఠినంగా పరిశీలిస్తోంది. ఈ-కామర్స్‌ సంస్థలకు 12 నోటీసులు, ఫుడ్‌ సర్వీస్‌ సంస్థలకు 30కి పైగా నోటీసులు జారీ చేసింది. రెస్టారెంట్‌ చైన్లు కూడా ఇందులో ఉన్నాయి. ఆహార ఉత్పత్తులపై చేసే ప్రతి క్లెయిమ్‌కు సరైన ఆధారాలు ఉండాలని, వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రచారం ఉండకూడదన్నదే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే కంపెనీలు నోటీసుల తర్వాత క్లెయిమ్‌లను మార్చడం మాత్రమే కాకుండా, భవిష్యత్తులోనూ నిబంధనలు పాటించేలా నిరంతర పర్యవేక్షణ అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

#Bournvita #FSSAI #FSSAIAction #BournvitaNews #MondelezIndia #MisleadingClaims #FoodSafety #FoodAdvertising #FoodLabels #NutritionClaims #FSSAIUpdates #FoodBrands #NestleIndia #PepsiCoIndia #CocaColaIndia #RedBullIndia #FoodSafetyIndia #IndiaNews