సెకండ్ ఒపీనియన్.. పెరుగుతుంది లైఫ్ లైన్

Second Opinion for Medical Treatment

56

సెకండ్ ఒపీనియన్ ఎందుకు?
చికిత్స ఏదైనా, వ్యాధి ఏదైనా!?
మొదటి నిర్ణయమే చివరిది కాదు
ప్రాణాలను కాపాడే రెండో అభిప్రాయం
ఒక్క డాక్టర్ మాటే అంతిమం కాదు!

ఆరోగ్య సమస్య వచ్చిందంటే చాలామంది డాక్టర్ చెప్పిందే తుది నిర్ణయంగా భావిస్తారు. ముఖ్యంగా శస్త్రచికిత్స చేయాలని, గుండె చికిత్సలు, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధికి చికిత్స ప్రారంభించాలని సూచించినప్పుడు భయం, సందేహం, ఆందోళన సహజం. అలాంటి సమయంలో మరో నిపుణుడి అభిప్రాయం తీసుకోవడం ఆలస్యం కాదు… అది తెలివైన నిర్ణయం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనినే ‘సెకండ్ ఒపీనియన్’ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇది ఇప్పుడు సాధారణ వైద్య విధానంగా మారింది. రెండో అభిప్రాయం వల్ల వ్యాధి నిర్ధారణలో మార్పు రావచ్చు. చికిత్స విధానం మారే అవకాశం ఉంటుంది. అవసరం లేని శస్త్రచికిత్సల నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్, గుండె జబ్బులు, మెదడు, వెన్నెముక శస్త్రచికిత్సలు, అరుదైన వ్యాధుల విషయంలో ఇది మరింత ఉపయోగపడుతుంది. ఒక డాక్టర్ చెప్పిన మాటను ప్రశ్నించడం కాదు, మన ఆరోగ్యంపై పూర్తి అవగాహనతో సరైన నిర్ణయం తీసుకోవడమే దీని అసలు ఉద్దేశం. వైద్యులే కూడా అవసరమైన సందర్భాల్లో రెండో అభిప్రాయాన్ని స్వాగతిస్తుండటం విశేషం. ఆరోగ్యంపై ధైర్యం, నమ్మకం, స్పష్టత పెంచే ఈ విధానం ప్రతి రోగి తెలుసుకోవాల్సిన కీలక అంశంగా మారింది.

ఒక డాక్టర్ చెప్పిన చికిత్సను వెంటనే అంగీకరించాలా? లేక మరో వైద్యుడి అభిప్రాయం కూడా తీసుకోవాలా? ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా శస్త్రచికిత్స, క్యాన్సర్, గుండె జబ్బులు, క్లిష్టమైన వ్యాధుల విషయంలో ఈ ప్రశ్న మరింత ముఖ్యమవుతుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రెండో వైద్యుడి సలహా తీసుకోవడం అనుమానం చూపడం కాదు. సరైన నిర్ణయం తీసుకునేందుకు ఉపయోగపడే మంచి అవకాశం. దీనివల్ల రోగిలో నమ్మకం పెరుగుతుంది. చికిత్సపై స్పష్టత వస్తుంది.

ఎందుకు అవసరమవుతుంది?
సాధారణంగా కడుపులో మంట, మింగడంలో ఇబ్బంది వంటి సమస్యలతో వైద్యుడిని కలిసిన వ్యక్తికి శస్త్రచికిత్స అవసరమని చెప్పినప్పుడు సహజంగానే భయం కలుగుతుంది. ఆ ఆపరేషన్ జీవితాంతం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందని తెలిసినప్పుడు మరో వైద్యుడిని సంప్రదించాలనే ఆలోచన రావడం సహజం. అలాంటి సమయంలో రెండో అభిప్రాయం తీసుకోవడం రోగికి ధైర్యాన్ని ఇస్తుంది. అదే చికిత్స సరైందా? మరో మార్గం ఉందా? అనే సందేహాలకు సమాధానం దొరుకుతుంది.

రోగుల హక్కుగా మారిన విధానం
గతంలో వైద్యుడు చెప్పిందే తుది నిర్ణయంగా భావించేవారు. కాలక్రమేణా రోగుల హక్కులకు ప్రాధాన్యం పెరిగింది. చికిత్స వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలు ముందుగానే వివరించడం వైద్యుల బాధ్యతగా మారింది. అదే సమయంలో అవసరమైతే మరో వైద్యుడి అభిప్రాయం తీసుకునే హక్కు కూడా రోగులకు లభించింది. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇది సాధారణ వైద్య విధానంగా మారింది. 1972లో మొదటిసారిగా శస్త్రచికిత్సకు ముందు రెండో అభిప్రాయం తీసుకునే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. వేలాది మంది రోగులు అందులో పాల్గొన్నారు. ఆశ్చర్యకరంగా దాదాపు 28 శాతం మంది మొదట సూచించిన చికిత్సను తిరస్కరించి మరో మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ ఫలితాలతో రెండో అభిప్రాయం ప్రాముఖ్యత మరింత పెరిగింది. ప్రస్తుతం చాలా ఆరోగ్య బీమా పథకాలు కూడా ఈ సేవకు ఆర్థిక సహాయం అందిస్తున్నాయి.

ఎప్పుడు తప్పనిసరిగా తీసుకోవాలి?
రెండో అభిప్రాయం తీసుకున్న తర్వాత కొంతమందిలో వ్యాధి నిర్ధారణే మారిపోతుంది. ముఖ్యంగా క్యాన్సర్, బయాప్సీ నివేదికలు, స్కాన్ ఫలితాల విషయంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని పరిశోధనల ప్రకారం క్యాన్సర్ రోగుల్లో 42 శాతం వరకు చికిత్స విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్నిసార్లు శస్త్రచికిత్స అవసరం లేదని కూడా తేలుతుంది. మరోవైపు సాధారణ వ్యాధుల విషయంలో కొత్త నిర్ధారణ తక్కువగా వచ్చినా రోగులకు ఉపయోగపడే సూచనలు ఎక్కువగా లభిస్తున్నాయి. అరుదైన వ్యాధి ఉన్నప్పుడు, క్లిష్టమైన శస్త్రచికిత్స సూచించినప్పుడు, తీవ్రమైన దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు, జీవితాంతం ప్రభావం చూపే చికిత్స అవసరమైనప్పుడు రెండో అభిప్రాయం తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే వైద్యుడు చెప్పిన విషయాలు పూర్తిగా అర్థం కాకపోయినా, సందేహాలు మిగిలినా మరో నిపుణుడిని సంప్రదించడం ప్రయోజనకరం.

డాక్టర్‌తో స్పష్టంగా మాట్లాడండి
రెండో అభిప్రాయం కోరడం వల్ల వైద్యుడు బాధపడతారని చాలామంది భావిస్తారు. వాస్తవానికి మంచి వైద్యులు రోగి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటారు. అందుకే మీ సందేహాలను నేరుగా చెప్పడం మంచిది. అవసరమైన పరీక్షల నివేదికలు, స్కాన్‌లు, మందుల వివరాలు తీసుకెళితే మరో వైద్యుడు త్వరగా సరైన అభిప్రాయం చెప్పగలుగుతారు. ఆస్పత్రికి వెళ్లే ముందు మీకు ఉన్న అన్ని ప్రశ్నలను రాసుకోవాలి. కుటుంబ సభ్యుడిని వెంట తీసుకెళ్లడం కూడా ఉపయోగకరం. మీ సమస్య ఎంతకాలంగా ఉందో, ఇప్పటి వరకు తీసుకున్న చికిత్స ఏమిటో వివరంగా చెప్పాలి. అలాగే ఆ వైద్యుడికి ఆ వ్యాధి చికిత్సలో ఎంత అనుభవం ఉందో కూడా అడగొచ్చు. అవసరమైతే పుస్తకాలు, పరిశోధన వివరాలు, నమ్మదగిన వెబ్‌సైట్ల సమాచారం ఇవ్వమని కోరాలి.

ఆరోగ్యంపై నిర్ణయం మీదే
ప్రతి వ్యాధికి ఒకే విధమైన అత్యవసర పరిస్థితి ఉండదు. కొన్ని శస్త్రచికిత్సలు వెంటనే చేయాల్సి ఉంటుంది. మరికొన్నింటికి కొన్ని రోజులు లేదా వారాల సమయం ఉంటుంది. అందుకే రెండో అభిప్రాయం తీసుకునే ముందు చికిత్స ఎంత అత్యవసరమో వైద్యుడిని అడగాలి. దీంతో అవసరమైన చికిత్స ఆలస్యం కాకుండా సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి నిర్ణయం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ఒక వైద్యుడి అభిప్రాయం వినడం ఎంత ముఖ్యమో, అవసరమైతే మరో నిపుణుడి సలహా తీసుకోవడం కూడా అంతే అవసరం. రెండో అభిప్రాయం అనేది వైద్యుడిపై అపనమ్మకం కాదు. అది రోగికి మరింత అవగాహన, నమ్మకం, భద్రత కలిగించే ప్రక్రియ. సరైన సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయం మంచి చికిత్సకు, మెరుగైన ఆరోగ్యానికి బలమైన పునాది అవుతుంది.

నమ్మకం పెంచేదే మంచి వైద్యం
ఆరోగ్య సేవల్లో విశ్వాసం అత్యంత విలువైన ఔషధం. రోగి సందేహాలను నివృత్తి చేయడం, చికిత్సకు ఉన్న ప్రత్యామ్నాయాలను వివరించడం, నిర్ణయం తీసుకునేందుకు తగిన సమయం ఇవ్వడం ప్రతి వైద్యుడి బాధ్యత. రెండో అభిప్రాయం కోరిన రోగిని అనుమానంతో చూడకుండా, అవసరమైన వైద్య రికార్డులు అందించి సహకరించడం ఆరోగ్యకరమైన వైద్య వ్యవస్థకు సంకేతం. మరోవైపు సామాన్యులు ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతి సమాచారాన్ని నిజమని నమ్మకుండా అర్హత కలిగిన నిపుణుల సలహానే తీసుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చే అపోహల ఆధారంగా చికిత్సను మధ్యలో నిలిపివేయడం, స్వయంగా మందులు వాడడం ప్రమాదకరం. కుటుంబ సభ్యులు కూడా రోగిపై ఒత్తిడి తీసుకురాకుండా ప్రశాంతంగా నిర్ణయం తీసుకునేలా అండగా నిలవాలి. వైద్యుడి అనుభవం, ఆస్పత్రి సౌకర్యాలు, చికిత్స ఫలితాలపై స్పష్టమైన సమాచారం తెలుసుకున్న తర్వాత తీసుకునే నిర్ణయమే ఉత్తమం. రోగి విశ్వాసం, వైద్యుడి పారదర్శకత, కుటుంబ సభ్యుల సహకారం కలిసొస్తేనే మెరుగైన చికిత్సతో పాటు మెరుగైన జీవన నాణ్యత సాధ్యమవుతుంది.

వైద్యంలో సెకండ్ ఒపీనియన్ – అవసరమా?

వైద్య రంగంలో “సెకండ్ ఒపీనియన్” అనేది వైద్యుడిపై అవిశ్వాసానికి సూచిక కాదు. ఇది రోగి తన ఆరోగ్యానికి సంబంధించిన కీలక నిర్ణయాలను మరింత అవగాహనతో తీసుకునేందుకు ఉపయోగపడే ఒక సముచితమైన ప్రక్రియ. ముఖ్యంగా శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి, దీర్ఘకాలిక వ్యాధులు లేదా ఖరీదైన చికిత్సల విషయంలో మరో నిపుణుడి అభిప్రాయం తీసుకోవడం సమంజసమే. నెఫ్రాలజీలో ఇది మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, డయాలిసిస్ ప్రారంభించాల్సిన సమయం, కిడ్నీ బయాప్సీ అవసరం, కిడ్నీ మార్పిడి వంటి నిర్ణయాలు రోగి జీవితాన్ని దీర్ఘకాలం ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సందర్భాల్లో రెండో అభిప్రాయం రోగిలో విశ్వాసాన్ని పెంచడమే కాకుండా, చికిత్సా విధానంపై స్పష్టతను కూడా అందిస్తుంది. చాలా సందర్భాల్లో ఇద్దరు నిపుణుల అభిప్రాయాలు ఒకేలా ఉండవచ్చు. అప్పుడు రోగికి తన చికిత్స సరైన దిశలో ఉందనే ధైర్యం కలుగుతుంది. అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పుడు, శాస్త్రీయ ఆధారాలతో ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకునే అవకాశం లభిస్తుంది. అయితే, ప్రతి చిన్న సమస్యకూ వైద్యులను తరచూ మార్చడం లేదా ఒకే విషయంపై అనేక అభిప్రాయాల కోసం తిరగడం చికిత్సలో ఆలస్యానికి దారితీయవచ్చు. అందువల్ల సెకండ్ ఒపీనియన్‌ను వివేకంతో వినియోగించాలి. వైద్యుడు–రోగి మధ్య పరస్పర విశ్వాసం, పారదర్శక సంభాషణ, శాస్త్రీయ దృక్పథం కలిసి ఉంటేనే ఉత్తమ వైద్య ఫలితాలు సాధ్యమవుతాయి.

కళాశికం క్రాంతి కుమార్
ఎండీ. డీఎం, సీనియర్ కన్సల్టెంట్
ఏఐఎన్‌యూ, హైటెక్ సిటీ, హైదరాబాద్