Home General లక్ష కోట్లు ఎవరివి.. ఎక్కడున్నాయి? మర్చిపోయిన డబ్బుపై మళ్లీ ఫోకస్

లక్ష కోట్లు ఎవరివి.. ఎక్కడున్నాయి? మర్చిపోయిన డబ్బుపై మళ్లీ ఫోకస్


బ్యాంకుల్లో మూలిగిపోతున్న సొమ్ము

ఒకప్పుడు బ్యాంకు ఖాతాలో వేసిన పైసలు.. కాలం గడిచేకొద్దీ ఎవరి జ్ఞాపకాల్లోనూ లేకుండా పోయాయి. చేతిలో ఉన్నప్పుడు చిన్న సొమ్ముల్లా కనిపించిన డబ్బే.. ఏళ్ల తర్వాత లక్షలు, కోట్లుగా మారింది. ఖాతాదారు లేరు.. వారసులకు సమాచారం లేదు.. పాత పాస్‌బుక్‌ మూలన పడిపోయింది. ఫోన్ నంబర్ మారిపోయింది.. చిరునామా మారిపోయింది. కానీ బ్యాంకులో ఉన్న సొమ్ము మాత్రం అక్కడే ఉంది. అలా దేశవ్యాప్తంగా మర్చిపోయిన ఖాతాలు పెరిగిపోతూ.. చివరకు దాదాపు రూ.లక్ష కోట్ల డిపాజిట్లు ఆర్బీఐకి చేరాయి. ఈ సొమ్ము ఎవరిది? ఏ కుటుంబానికి చెందింది? ఎప్పుడో దాచిన పైసలు ఇప్పుడు ఎక్కడున్నాయి? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. ముఖ్యంగా ఇంట్లో పెద్దలు చనిపోయిన తర్వాత వారి బ్యాంకు ఖాతాల గురించి పట్టించుకోని కుటుంబాలు ఒక్కసారి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మీ తాత దాచిన సొమ్మా? మీ నాన్న మరిచిపోయిన డబ్బా? లేక మీ పేరుతోనే ఉన్న పాత ఖాతానా? సమాధానం తెలుసుకోవడానికి ఆర్బీఐ తీసుకొచ్చిన ఉడ్గామ్ పోర్టల్‌ ఇప్పుడు కీలక మార్గంగా మారింది.

బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి తర్వాత వాటిని పట్టించుకోని వారు ఎందరో. ఖాతాదారులు చనిపోవడం, వారసులకు సమాచారం లేకపోవడం, పాత ఫోన్ నంబర్లు, మారిపోయిన చిరునామాలు వంటి కారణాలతో భారీ మొత్తంలో డిపాజిట్లు క్లెయిమ్‌ కాకుండా మిగిలిపోతున్నాయి. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (డీఈఏ) ఫండ్‌కు దాదాపు రూ.లక్ష కోట్ల మేర డిపాజిట్లు బదిలీ అయ్యాయి. 2026 జనవరి 31 నాటికి ఈ మొత్తం రూ.98,073 కోట్లుగా ఉంది. అంటే ఈ డబ్బు ఎవరిదో.. అసలు ఖాతాదారులు, వారి కుటుంబాలకు కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

డబ్బు ఆర్బీఐ వద్దకు వెళ్లిందంటే పోయినట్టేనా?

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. బ్యాంకు నుంచి ఆర్బీఐ, డీఈఏ ఫండ్‌కు డబ్బు బదిలీ అయినంత మాత్రాన ఖాతాదారుడి హక్కు పోదు. ఖాతాదారు, నామినీ లేదా చట్టబద్ధమైన వారసులు సరైన ఆధారాలు సమర్పించి తమ డబ్బును తిరిగి పొందవచ్చు. సాధారణంగా రెండేళ్లకు పైగా ఖాతాదారు స్వయంగా లావాదేవీలు చేయకపోతే ఖాతా ఇన్‌ఆపరేటివ్‌గా మారుతుంది. పదేళ్లపాటు డబ్బు క్లెయిమ్‌ కాకపోతే అది డీఈఏ ఫండ్‌కు బదిలీ అవుతుంది. కుటుంబ సభ్యులు చనిపోయిన వారి పాత బ్యాంకు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయేమో ఒకసారి తప్పక పరిశీలించాల్సిన అవసరం ఇక్కడే ఉంది.

మీ డబ్బు ఉందో ఇలా తెలుసుకోండి

మీ పేరు మీద లేదా కుటుంబ సభ్యుల పేరుతో మర్చిపోయిన డిపాజిట్ ఉందేమో తెలుసుకోవడానికి ఆర్బీఐ ఉడ్గామ్ పోర్టల్ ఉపయోగించవచ్చు. ఒకే ప్లాట్‌ఫామ్‌లో పలు బ్యాంకుల్లో ఉన్న అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను వెతికే అవకాశం ఉంది. అయితే ఉడ్గామ్‌లో డబ్బు కనిపించిందంటే అక్కడి నుంచే డబ్బు చేతికి రాదు. డిపాజిట్ ఉన్న బ్యాంకును సంప్రదించి క్లెయిమ్‌ ప్రక్రియ పూర్తి చేయాలి. నామినీ లేదా వారసులు అవసరమైన పత్రాలు సమర్పించాలి. ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమాల ద్వారా ఇప్పటికే రూ.5,777 కోట్ల విలువైన అన్‌క్లెయిమ్డ్‌ ఆస్తులను 22.95 లక్షల క్లెయిమ్‌లకు తిరిగి అందించారు. కాబట్టి “లక్ష కోట్లు ఎవరిస్తారు?” అనే ప్రశ్నకు సమాధానం.. ఆ డబ్బు బ్యాంకుల్లోనే ఉంది. మీ కుటుంబానికి చెందినదేమైనా అందులో ఉందేమో ఇప్పుడే చెక్‌ చేసుకోవడమే అసలు విషయం.

 

#UnclaimedDeposits #RBI #UDGAMPortal #UnclaimedMoney #BankDeposits #ForgottenBankAccounts #RBIIndia #DEAFund #DormantAccounts #BankAccount #LegalHeirs #Nominee #PersonalFinance #FinancialAwareness #IndiaNews