Home Inter National News ఒమన్‌‌కు బాంబ్ బెదిరింపు ట్రంప్ హెచ్చరికతో దుమారం

ఒమన్‌‌కు బాంబ్ బెదిరింపు ట్రంప్ హెచ్చరికతో దుమారం


హర్మూజ్‌ కోసం అమెరికా గేమ్ .

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. ఇరాన్‌తో అమెరికా ఒప్పందానికి ఒమన్ అడ్డుపడితే సైనిక చర్యకు దిగుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక చేసినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఇరాన్ అణు కార్యక్రమం, హోర్ముజ్ జలసంధి నియంత్రణ విషయంలో అమెరికా కఠిన వైఖరి కొనసాగిస్తోంది. ఇరాన్ మాత్రం లొంగిపోవాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఈ పరిణామంతో ఇప్పటికే యుద్ధ ఉద్రిక్తతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న గల్ఫ్ ప్రాంతంలో మరోసారి ఆందోళన నెలకొంది.

హర్మూజ్‌.. అసలు పంచాయితీ

ఇరాన్, ఒమన్ అధికారులు కొంతకాలంగా హర్మూజ్ జలసంధి ద్వారా సముద్ర రవాణా భవిష్యత్తుపై చర్చలు జరుపుతున్నారు. ఇరాన్ విదేశాంగ శాఖ కూడా ఇరు దేశాలు సంయుక్త ప్రకటనపై పనిచేస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలమార్గంపై నియంత్రణ ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ప్రధాన వివాదంగా మారింది. హర్మూజ్‌లో రాకపోకలు తీవ్రంగా దెబ్బతినడంతో చమురు సరఫరాపై కూడా ప్రభావం పడుతోంది. ట్రంప్ ఇప్పటికే ఈ జలసంధిపై అమెరికా నియంత్రణ ఉండాలని పట్టుబడుతున్నారు. ఇరాన్ మాత్రం హోర్మూజ్ తమ ఆధీనంలోనే ఉంటుందని స్పష్టం చేస్తోంది.

ఒమన్ మధ్యవర్తిత్వానికి షాక్

ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఒమన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఇరాన్ కూడా చర్చలు విఫలమైతే హోర్మూజ్‌లో మరింత దూకుడైన సైనిక చర్యలకు దిగే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. దీంతో ఒకవైపు దౌత్య చర్చలు.. మరోవైపు యుద్ధ బెదిరింపులు సాగుతున్నాయి. ఈ పరిణామాలు ముదిరితే హర్మూజ్ జలసంధి మాత్రమే కాదు.. ప్రపంచ చమురు సరఫరా, ఇంధన ధరలు, అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు అందరి చూపు ఒమన్, ఇరాన్, అమెరికా తదుపరి అడుగులపైనే ఉంది.

 

#DonaldTrump #Oman #Iran #StraitOfHormuz #USIranTensions #TrumpWarning #IranNuclearProgram #MiddleEastCrisis #GulfTensions #OmanMediation #OilSupply #GlobalEnergy #USPolitics #IranNews #WorldNews