పరీక్షల రద్దుకు సర్కారు ఆమోదంతో టర్న్
సీబీఐ విచారణకు పట్టుతో ఉత్కంఠ
ఝార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల అక్రమాలపై విద్యార్థులు చేపట్టిన 24 రోజుల ఉద్యమం కీలక మలుపు తిరిగింది. విద్యార్థుల ఆందోళనకు దిగొచ్చిన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వం 2014 నుంచి జరిగిన పరీక్షలు, నియామకాల్లో తప్పిదాలపై విచారణకు హామీ ఇచ్చింది. జేపీఎస్సీ, జేఎస్సీఎస్సీ సీజీఎల్ సహా పలు పరీక్షలు, నియామకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. లక్నోకు చెందిన టీఎస్‌ఆర్ డేటా ప్రాసెసింగ్ సంస్థకు సంబంధించిన ఫలితాలు, ఎంపిక ప్రక్రియలను కూడా రద్దు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. 2014 నుంచి జరిగిన అన్ని పరీక్షలను సీఐడీ విచారించనుంది. పరీక్షా వ్యవస్థలో సంస్కరణల కోసం ఐఏఎస్ అధికారి అమితాభ్ కౌశల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
మహతో దీక్ష విరమణ.. ఉద్యమానికి విరామం
సర్కార్ కీలక నిర్ణయాల నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి నేత దేవేంద్రనాథ్ మహతో నిరాహార దీక్ష విరమించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనను కలిసి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. ప్రభుత్వం అక్రమాల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించే ప్రయత్నం చేస్తోందని మహతో పేర్కొన్నారు. పరీక్షా వ్యవస్థలో అవినీతిని నిర్మూలించే చర్యలకు విద్యార్థులు సహకరిస్తారని తెలిపారు. అయితే భవిష్యత్‌లో మళ్లీ పేపర్ లీకులు, నియామక అక్రమాలు జరగకుండా శాశ్వత పరిష్కారం చూపే వ్యవస్థ కావాలని ఆయన స్పష్టం చేశారు.
సీబీఐ డిమాండ్‌తో పోరు ఇంకా మిగిలే
మహతో దీక్ష విరమించినా విద్యార్థుల అసలు డిమాండ్ పూర్తిగా నెరవేరలేదు. సీబీఐతో సమగ్ర విచారణ జరపాలన్న డిమాండ్‌పై విద్యార్థులు ఇంకా పట్టుబడుతున్నారు. గతంలో సీబీఐ, సీఐడీ విచారణలకు ఆదేశించినా అవి మధ్యలోనే ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయని మహతో గుర్తుచేశారు. అందుకే కేవలం దర్యాప్తు ప్రకటన కాకుండా, పరీక్షా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసి విచారణకు సిద్ధమైనా సీబీఐ విచారణపై స్పష్టత వచ్చే వరకు విద్యార్థుల పోరాటం పూర్తిగా ముగిసినట్లు చెప్పలేని పరిస్థితి కొనసాగుతోంది.











