ఒక్క అప్డేట్.. వందల కుటుంబాల్లో టెన్షన్
ఒక్క ప్రభుత్వ అప్డేట్.. వందలాది కుటుంబాల్లో ఆందోళన. ఏళ్లుగా తమ పేరుతో ఉన్న భూములు.. ఒక్కసారిగా 22ఏ నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయి. రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. భూములపై హక్కులు ఉన్నా.. వాటిని విక్రయించలేని పరిస్థితి వచ్చింది. అసలు ఏం జరిగింది? ఎవరి తప్పిదం? బాధితులకు పరిష్కారం ఎలా? ఇప్పుడు ఇదే ప్రశ్న తెలంగాణలో చర్చగా మారింది. ఈ వ్యవహారంపై మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల నుంచి ఏకంగా 750 దరఖాస్తులు ప్రభుత్వానికి చేరాయి. తమ ప్రైవేట్ భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని బాధితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిశీలించింది.
అధికారుల తరఫున మంత్రి సారీ
హైదరాబాద్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నాలుగు జిల్లాల అధికారులతో సమావేశమయ్యారు. 22ఏ జాబితాలోకి వెళ్లిన భూముల వివరాలను పరిశీలించారు. గతంలో ఈ భూములు యూఎల్సీ జాబితాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత నిషేధిత భూముల జాబితాను అప్డేట్ చేసే సమయంలో అసలు సమస్య మొదలైందని ప్రభుత్వం తేల్చింది. భూముల వివరాలను అప్డేట్ చేసే ప్రక్రియలో తప్పిదం జరిగింది. గతంలో ఉన్న యూఎల్సీ వివరాలు.. కొత్త నిషేధిత జాబితాలోకి చేరిపోయాయి. ఫలితంగా ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూములు కూడా 22ఏ జాబితాలో కనిపించాయి. దీంతో రిజిస్ట్రేషన్లు, భూముల లావాదేవీల విషయంలో సమస్యలు తలెత్తాయి. ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులకు ఆటంకం కలిగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. జరిగినది ఉద్దేశపూర్వక చర్య కాదని చెప్పారు. నిషేధిత జాబితాను అప్డేట్ చేసే సమయంలో జరిగిన పొరపాటు వల్లే సమస్య తలెత్తిందని వెల్లడించారు. ఈ తప్పిదంపై మంత్రి కీలక ప్రకటన చేశారు. అధికారుల తరఫున క్షమాపణలు కోరుతున్నామని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం చేసిన పొరపాటుతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రైవేట్ భూముల యజమానులకు స్పష్టమైన భరోసా ఇచ్చారు.
బాధితులకు ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్
అర్హత ఉన్న ప్రైవేట్ భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి త్వరలోనే తొలగిస్తామని మంత్రి ప్రకటించారు. భూములకు సంబంధించిన పత్రాలు సక్రమంగా ఉన్నవారు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని సూచించారు. సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. తమ భూములు 22ఏ జాబితాలోకి వెళ్లాయని భావించే వారు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం 18005994788 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. బాధితులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు.
ఇక భూ యజమానుల చూపంతా ప్రభుత్వంపైనే
ఒక డేటా అప్డేట్ చేసిన తప్పిదం.. వందలాది భూ యజమానులను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇప్పుడు ప్రభుత్వం పొరపాటును అంగీకరించింది. ప్రైవేట్ భూములను 22ఏ నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చింది. మరి ఈ ప్రక్రియ ఎంత వేగంగా పూర్తవుతుంది? బాధితుల భూములపై ఆంక్షలు ఎప్పుడు తొలగుతాయి? ఇప్పుడు తెలంగాణలో భూ యజమానుల చూపంతా ప్రభుత్వ తదుపరి చర్యలపైనే ఉంది.











