ప్రజలు ఆందోళన చెందొద్దన్న పొంగులేటి.
నిషేధిత భూముల పీఓబీ, 22ఎ జాబితాలో ఉన్న ఆస్తులపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న సాంకేతిక, చట్టపరమైన సమస్యలను పరిష్కరించి బాధితులకు ఊరట కల్పిస్తామని తెలిపారు.
14లోగా డాక్యుమెంట్లన్నీ ఆన్లైన్లో
భూముల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ వివరాలు, లే అవుట్ అనుమతులు సహా అన్ని పత్రాలను ఆగస్టు 14లోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ వివరాలతో పత్రాలను సరిపోల్చడం ద్వారా బోగస్ డాక్యుమెంట్లకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. పీఓబీ, 22ఎకు వచ్చిన దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ప్రతి దరఖాస్తును కేసుల వారీగా పరిశీలించి నిజానిజాలను త్వరగా తేల్చాలని సూచించారు. పేదలు, అర్హులకు అన్యాయం జరిగితే సహించబోమని హెచ్చరించారు.
సబ్ రిజిస్ట్రార్ల విచక్షణకు చెక్
సబ్ రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలను పరిమితం చేస్తామని మంత్రి తెలిపారు. ఆన్లైన్లో ఉన్న అధికారిక వివరాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పీఓబీ జాబితాలో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను గుడ్డిగా తిరస్కరించకుండా, కారణాలను స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదని పొంగులేటి స్పష్టం చేశారు. ఏ చిన్న తప్పిదానికైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పహాణీల వివరాలు కూడా సబ్ రిజిస్ట్రార్లకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీంతో భూ లావాదేవీల్లో పారదర్శకత పెరగడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
#Telangana #ProhibitedLands #POB #22A #PonguletiSrinivasReddy #LandRegularisation #LandRecords #LandRegistration #TelanganaLandIssues #LandReforms #TelanganaGovernment #LandDisputes #RevenueDepartment #PropertyRegistration #TelanganaNews











