Home Telangana జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఎన్నికల్లో మోసం?

జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఎన్నికల్లో మోసం?

Jubilee Hills International Centre Election Fraud

132

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ (JHIC) ఎన్నికలకు సంబంధించి మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్తపై జూబ్లీహిల్స్ పోలీసులు తాజా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వివాదానికి సంబంధించి జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ మాజీ అధ్యక్షుడు కె. సురేందర్ రెడ్డి పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జెహెచ్ఐసీ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్‌గా నియమించుకునేందుకు ఐదుగురు వ్యక్తులు కలిసి పాత కమిటీకి సంబంధించిన కీలక పత్రాలను ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో సిహెచ్. వసంత్ కుమార్, టి. ప్రద్యుమ్న కుమార్ రెడ్డి, సిహెచ్. జగ్గారావు, ఎం. జనార్దన్ రెడ్డి, ఎ. సురేష్ రెడ్డిలను వరుసగా ఏ1 నుంచి ఏ5 నిందితులుగా పోలీసులు చేర్చారు. నిందితులు పాత కమిటీ సభ్యులతో పాటు, మాజీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని ఆరోపణలు వచ్చాయి. సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా సేకరించిన వివరాల ప్రకారం, రిటర్నింగ్ ఆఫీసర్‌గా నియమించినట్లు చూపించిన పాలక మండలి సమావేశపు మినిట్స్ నకిలీవని తేలింది. ఆ అంశం సమావేశ అజెండాలోనే లేదని, తన సంతకాన్ని కూడా పలు కీలక పత్రాల్లో ఫోర్జరీ చేశారని సురేందర్ రెడ్డి ఆరోపించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్‌ను తప్పుదోవ పట్టించేందుకు నకిలీ పత్రాలు సమర్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, న్యాయ ఖర్చుల పేరుతో సుమారు రూ.75 లక్షల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు. ఈ కేసులో అప్పటి పాలక మండలి సభ్యులు పలువురిని కూడా నిందితులుగా చేర్చారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.