రాచమల్లు మాటలు వాస్తవాలకు దూరం: జబీవుల్లా

Rachamallu Shivaprasad Reddy criticism

47

రాచమల్లుకు సీమ స్టైల్‌లో జబీవుల్లా కౌంటర్

“రాచమల్లన్నా… నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడితే జనం నమ్మే రోజులు పోయాయి. ఒకప్పుడు చెప్పిన మాటకు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటకు పొంతనే లేదు. రాజకీయాల కోసం ప్రతిరోజూ కథలు అల్లితే ప్రజలు చప్పట్లు కొట్టరు. ముందు నీ మాటలకు నువ్వే జవాబు చెప్పు. ఇతరులపై వేలెత్తే ముందు నీ వైఖరి ఏంటో చూసుకో. ప్రొద్దుటూరు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరు అభివృద్ధి చేశారు… ఎవరు అడ్డుపడ్డారు… అన్నది వారికి బాగా తెలుసు. ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే తీర్పు చెప్పారు. ఇంకా అదే పాత రాజకీయాలతో ప్రజలను మభ్యపెట్టాలనుకుంటే కుదరదు. సీమలో మాటకు విలువ ఉంటుంది… మాట మార్చేవారికి కాదు” అని జబీవుల్లా ఘాటుగా వ్యాఖ్యానించారు.

రాజకీయ విమర్శలకు ప్రజలే తీర్పు

టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్లా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ప్రొద్దుటూరులోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే రాచమల్లు ప్రతిరోజూ అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో చేసిన వ్యాఖ్యలకు, ప్రస్తుతం చేస్తున్న వ్యాఖ్యలకు పొంతన లేదని విమర్శించారు.

జగన్‌మోహన్ రెడ్డిని సమర్థిస్తూ మాట్లాడుతున్న రాచమల్లు, గతంలో సీబీఐ, సుప్రీంకోర్టును ప్రశంసించారని, అదే సంస్థలు జగన్‌ను ఆర్థిక నేరాల కేసుల్లో నిందితుడిగా పేర్కొన్న విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి హాజరు కాకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, గత ప్రభుత్వ అవినీతిపై సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతోనే సభకు రావడం లేదని ఆరోపించారు.

కాంట్రాక్టర్లపై చేస్తున్న ఆరోపణలు ఆధారరహితమని పేర్కొన్న జబీవుల్లా, ప్రొద్దుటూరులో ప్రస్తుతం అభివృద్ధి, రోడ్లు, సంక్షేమం, శాంతిభద్రతలు గత వైఎస్సార్‌సీపీ పాలన కంటే మెరుగ్గా ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిపై విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించిన ఆయన, వివేకానంద రెడ్డి హత్య కేసు, నందం సుబ్బయ్య హత్య కేసులపై ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమేనా అని రాచమల్లుకు సవాల్ విసిరారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే తమ తీర్పు ఇచ్చారని జబీవుల్లా పేర్కొన్నారు.