Home Telangana క్యుములోనింబస్ ఎఫెక్ట్ రాష్ట్రాన్ని కమ్ముకున్న వర్ష మేఘాలు

క్యుములోనింబస్ ఎఫెక్ట్ రాష్ట్రాన్ని కమ్ముకున్న వర్ష మేఘాలు


మూడు రోజుల పాటు వానలే వానలు.


క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. కామారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు, ప్రయాణికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

18 జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్‌తో పాటు జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కుమ్రం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.

పిట్లంలో అత్యధిక వర్షం

గత 24 గంటల్లో రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో 11.56 నుంచి 20.44 సెంటీమీటర్ల మధ్య భారీ వర్షపాతం నమోదైంది. మరో 40 మండలాల్లో 6.45 నుంచి 11.55 సెంటీమీటర్ల మధ్య వర్షం కురిసింది. అలాగే 281 మండలాల్లో 1.56 నుంచి 6.44 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో అత్యధికంగా 14.11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల చెరువులు, వాగులు, కాల్వల్లో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అవసరం లేకుండా వరద ప్రాంతాల్లోకి వెళ్లొద్దని ప్రజలకు సూచించారు.

 

#TelanganaWeather #HeavyRains #CumulonimbusClouds #RainAlert #HyderabadWeather #TelanganaMonsoon #OrangeAlert #YellowAlert #WeatherUpdate #KamareddyRainfall #TelanganaNews #MonsoonUpdate #RainForecast #WeatherNews