అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాజకీయ కారణాలతో పర్యటనను అడ్డుకున్నారన్న ఆరోపణలు అర్థరహితమని కొట్టిపారేశారు. ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు సంబంధించి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే కేంద్ర విదేశాంగ శాఖ నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా విదేశీ పర్యటనకు ఎందుకు ప్రయత్నించారో సీఎం రేవంత్‌రెడ్డి వివరించాలని డిమాండ్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రికి అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి తనకు ఇవ్వలేదన్న రేవంత్ వాదన సరైంది కాదన్నారు. గతంలో నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన విదేశీ పర్యటనను నిరాకరించిందని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డికి హార్వర్డ్ బిజినెస్ కోర్సు కోసం కేంద్రం అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఇది రాజకీయ నిర్ణయం కాదు.. నిబంధనల ప్రక్రియ మాత్రమే అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
మేయర్ మమ్దానీతో భేటీ ఎందుకు?
రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన ఉద్దేశం ఏంటో కూడా స్పష్టంగా చెప్పాలని కిషన్‌రెడ్డి కోరారు. ముఖ్యంగా న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీతో భేటీ కావాలనుకున్నట్లు వచ్చిన వార్తలపై సీఎం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మమ్దానీ భారత్‌పై వ్యతిరేక వైఖరి ప్రదర్శించారని, ప్రధాని మోదీపై గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి ఎందుకు కలవాలనుకున్నారో ప్రజలకు వివరించాలని అన్నారు. మరోవైపు తెలంగాణలో జరిగిన కులగణనపైనా కిషన్‌రెడ్డి విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో సుమారు 20 శాతం ఇళ్లలో కులగణన జరగలేదని ఆరోపించారు. కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. మొత్తం మీద రేవంత్ అమెరికా పర్యటన చుట్టూ రాజకీయ వివాదం కొనసాగుతున్న వేళ.. పర్యటన ఉద్దేశం, మమ్దానీతో భేటీ కారణం, కేంద్ర అనుమతుల అంశంపై సీఎం నుంచి స్పష్టత రావాల్సి ఉందని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
#RevanthReddy #RevanthReddyUSTour #RevanthReddyAmericaVisit #KishanReddy #GKishanReddy #TelanganaCM #TelanganaPolitics #USATour #AmericaVisit #ForeignVisit #CentralGovernment #ForeignAffairs #ZohranMamdani #NewYorkMayor #ModiGovernment #TelanganaGovernment #PoliticalControversy #TelanganaNews #IndiaPolitics #USIndiaRelations











