Home AP రామాయపట్నం పోర్టుపై జగన్ ఫైర్!

రామాయపట్నం పోర్టుపై జగన్ ఫైర్!

11


అభివృద్ధా.. భారీ కుంభకోణమా?
ఎక్స్‌లో ప్రభుత్వంపై విమర్శలు.

 మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామాయపట్నం పోర్టు అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. తన ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో రామాయపట్నం పోర్టు భవిష్యత్తు అభివృద్ధి దిశగా సాగుతోందా, లేక భారీ కుంభకోణానికి వేదికగా మారుతోందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి పోర్టును ప్రైవేటు చేతుల్లోకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మిస్తున్న పోర్టును తక్కువ మొత్తానికి అప్పగించడం రాష్ట్రానికి భారీ నష్టమని పేర్కొన్నారు.

పెట్టుబడులకు రామాయపట్నం కీలకం

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల అభివృద్ధికి పటిష్ఠమైన పునాది వేసినట్లు జగన్ తన పోస్టులో తెలిపారు. భూసేకరణ, చట్టపరమైన అనుమతులు, ఆర్థిక వనరుల సమీకరణ, ఈపీసీ ఒప్పందాలు పూర్తి చేసి నిర్మాణ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. 2024 జూన్ నాటికే మూడు పోర్టుల్లో గణనీయమైన భౌతిక పురోగతి సాధించామని వెల్లడించారు. రామాయపట్నం పోర్టు అభివృద్ధితో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయని జగన్ పేర్కొన్నారు. బీపీసీఎల్ ప్రతిపాదించిన లక్ష కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌కు ఈ పోర్టు ప్రధాన ఆధారమని చెప్పారు. ఇండోసోల్ సోలార్ గిగా తయారీ యూనిట్ కూడా రామాయపట్నం పోర్టు సమీపంలోనే ఏర్పాటవుతోందని గుర్తు చేశారు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తన ఉక్కు పరిశ్రమ అవసరాల కోసం ఈ పోర్టులో రెండు బెర్త్‌లను అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని, రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు.

చంద్రబాబుకు జగన్ ప్రశ్న

ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రూ.4,929 కోట్ల ప్రజాధనంతో నిర్మిస్తున్న పోర్టును కేవలం రూ.1,500 కోట్ల ముందస్తు చెల్లింపుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతుందని అన్నారు. పోర్టు నిర్మాణానికి తీసుకున్న రుణాల భారం మాత్రం ప్రభుత్వంపైనే మిగిలిపోతుందని, రూ.3,500 కోట్లకు పైగా రుణ సేవా బాధ్యత రాష్ట్రంపై పడుతుందని పేర్కొన్నారు. ఈ విధానం ఏ ఆర్థిక సిద్ధాంతానికి అనుగుణమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి దీర్ఘకాలిక ఆదాయం తెచ్చిపెట్టే కీలక మౌలిక వసతిని ప్రైవేటు సంస్థలకు తక్కువ విలువకు అప్పగించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం వాటిని నష్టపరిచే నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు.