క్వింటాల్‌కు రూ.8,667 కనీస మద్దతు ధర.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని తుమ్మల ఆదేశం.
తెలంగాణలో 2026–27 ఖరీఫ్ సీజన్ పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం సన్నద్ధమైంది. కొనుగోలు కేంద్రాలను గత ఏడాది తరహాలో ఏర్పాటు చేసి, రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సచివాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షలో పత్తి సాగు, ఉత్పత్తి అంచనాలు, మార్కెట్ ధరలు, సీసీఐ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సీజన్‌లో తెలంగాణలో 48.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, 29.43 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667 కాగా, రాష్ట్రంలో మోడల్ మార్కెట్ ధర సుమారు రూ.9,000గా ఉంది. మార్కెట్ ధర తగ్గితే సీసీఐ కేంద్రాల్లో విక్రయించుకునే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం 133 సీసీఐ కొనుగోలు కేంద్రాల కోసం 30 జిల్లాల్లో 335 జిన్నింగ్ మిల్లులను గుర్తించారు. నాణ్యత పరీక్షలు, తేమ శాతం పరిశీలన, రవాణా, సకాలంలో చెల్లింపులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ధరల వ్యత్యాసంపై అధ్యయనం.. డిజిటల్ సేవలతో సౌలభ్యం
గుజరాత్, మహారాష్ట్రతో పోలిస్తే తెలంగాణలో పత్తి ధరలు కొన్ని మార్కెట్లలో తక్కువగా ఉండటానికి కారణాలను విశ్లేషించాలని తుమ్మల ఆదేశించారు. రాష్ట్రంలో పత్తి ప్రాసెసింగ్, స్పిన్నింగ్, ఆయిల్ పరిశ్రమల విస్తరణకు ప్రోత్సాహకాలు, రాయితీలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ధరలు, కొనుగోళ్ల పురోగతిని పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కపాస్ కిసాన్ యాప్‌లో 12,75,185 మంది రైతులకు సంబంధించిన 21,58,938 వివరాలు అనుసంధానమయ్యాయి. రైతులు తమ వివరాలను పరిశీలించి, స్లాట్ బుకింగ్‌కు ముందు నమోదు సరిచూసుకోవాలని సూచించారు. అదనపు దిగుబడి ధ్రువీకరణకు వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించవచ్చు. కౌలు రైతులు కూడా అవసరమైన పత్రాలతో నమోదు చేసుకోవాలి. సహాయం కోసం 1800-599-5779 టోల్‌ఫ్రీ నంబర్, 8897281111 వాట్సాప్ సేవలు అందుబాటులో ఉన్నాయి. రైతు వేదికల్లో తేమ పరీక్ష పరికరాలు, మార్కెట్ యార్డుల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. మార్కెట్ ధరను పరిశీలించి, గిట్టుబాటు ధర లభించే చోట పత్తి విక్రయించాలని రైతులకు సూచించారు.
#TelanganaCotton #CottonProcurement #CottonMSP #ThummalaNageswaraRao #CCI #TelanganaFarmers #Kharif2026 #KapasKisan #AgricultureNews #FarmerSupport











