Home AP మున్సిపల్ ఎన్నికలపై క్లారిటీ

మున్సిపల్ ఎన్నికలపై క్లారిటీ

నాలుగు చొట్ల మాత్రమే గడువు పొడిగింపు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్‌ఈసీ నిర్ణయం.
మరో 48 గంటలపాటు నామినేషన్లకు ఛాన్స్.
నవంబర్‌ 1న పోలింగ్‌, 3న ఓట్ల లెక్కింపు .

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల గడువును రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మరో 48 గంటలు పొడిగించింది. నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారన్న ఫిర్యాదులపై స్పందించిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్ చంద్ర పునేఠా గురువారం ప్రకటించారు. అక్టోబర్‌ 23, 24 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు కొత్తగా నామినేషన్లు సమర్పించవచ్చు. కడప, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్లు, రాజంపేట, మైదుకూరు మున్సిపాలిటీల్లో ఎంపిక చేసిన వార్డులకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుంది.

అక్టోబర్‌ 25న తుది అభ్యర్థుల జాబితా

నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబర్‌ 25న తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఈ మార్పులతోపాటు మిగిలిన ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సవరించిన షెడ్యూల్‌ మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థలకు వర్తిస్తుంది. నవంబర్‌ 1న పోలింగ్‌, అవసరమైతే నవంబర్‌ 2న రీపోలింగ్‌, నవంబర్‌ 3న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. గతంలో అక్టోబర్‌ 21న తుది జాబితా ప్రకటించాల్సి ఉండగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ గడువు మారింది.

అభ్యర్థులను అడ్డుకున్నారంటూ వైఎస్సార్‌సీపీ పిటిషన్‌

నామినేషన్లు దాఖలు చేయకుండా తమ అభ్యర్థులను హింస, బెదిరింపులతో అడ్డుకున్నారని వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాదాపు 63 శాతం మంది అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారని ఆ పార్టీ తరఫు సీనియర్‌ న్యాయవాది మణీందర్‌ సింగ్‌ వాదించారు. నామినేషన్‌ పత్రాలను చించివేస్తున్న దృశ్యాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఈ వాదనలను వ్యతిరేకించాయి. పిటిషనర్‌ పార్టీనే హింసను ప్రేరేపించిందని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు ఆరోపించారు.

స్వేచ్ఛాయుత ఎన్నికలపై సుప్రీంకోర్టు స్పష్టత

జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం అక్టోబర్‌ 22లోగా గడువు పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. నామినేషన్‌ కేంద్రాల్లో పోలీసు భద్రత, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించింది. ఫిర్యాదులు, వీడియో ఆధారాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఈసీకి సూచించింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో సాధారణంగా జోక్యం చేసుకోకపోయినా, అక్రమాలను అడ్డుకోవాల్సిన సందర్భాల్లో న్యాయస్థానాలు మౌనంగా ఉండలేవని పేర్కొంది. తదుపరి విచారణను అక్టోబర్‌ 27కు వాయిదా వేసింది.

 

#APMunicipalElections #AndhraPradesh #APSEC #SupremeCourt #NominationDeadline #LocalBodyElections #Kadapa #Tirupati #Rajampet #Mydukur #YSRCP #ElectionNews