Home AP పెట్టుబడులు ఒప్పందాలకే పరిమితం కావొద్దు!

పెట్టుబడులు ఒప్పందాలకే పరిమితం కావొద్దు!

పరిశ్రమల స్థాపనపై చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన పెట్టుబడులు కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, వాస్తవ పరిశ్రమలుగా రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 22వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. గతంలో కుదిరిన 714 పెట్టుబడి ఒప్పందాల్లో ఇప్పటికే 519 ప్రాజెక్టుల పనులు ప్రారంభమైనట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లి, పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పరిశ్రమలు, ఇంధనం, పర్యాటకం, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, ఆహార శుద్ధి, మౌలిక సదుపాయాల రంగాల్లోని పెట్టుబడి ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు.

విశాఖలో అంతర్జాతీయ కన్వెన్షన్‌ కేంద్రం

విశాఖపట్నంలో ప్రపంచస్థాయి అంతర్జాతీయ కన్వెన్షన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. పెట్టుబడుల సదస్సులు నిర్వహించేందుకు ఇది కీలక వేదికగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. రాయలసీమను అంతర్జాతీయ ఉద్యానవన పంటల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఆహార శుద్ధి పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్లు, రైల్వే మార్గాలతోపాటు తూర్పు–పడమర అనుసంధానాన్ని బలోపేతం చేయాలని ఆదేశించారు.

సెమీకండక్టర్‌ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం

ఆంధ్రప్రదేశ్‌లో సెమీకండక్టర్‌ తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తయారీ యూనిట్లు విస్తృత పారిశ్రామిక వ్యవస్థలో భాగమయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సమావేశంలో మంత్రులు నారా లోకేశ్‌, టీజీ భరత్‌, అనగాని సత్యప్రసాద్‌, గొట్టిపాటి రవికుమార్‌, పొంగూరు నారాయణ, కందుల దుర్గేశ్‌ పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు.

 

#ChandrababuNaidu #AndhraPradesh #APInvestments #SIPBMeeting #IndustrialDevelopment #Visakhapatnam #Rayalaseema #SemiconductorIndustry #FoodProcessing #NaraLokesh #EconomicGrowth