ఏఐ ఆశలు, ఆర్థిక ఆందోళనలతో కలవరం.
చైనా స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఏఐ రంగంపై భారీ ఆశలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఆర్థిక పునరుజ్జీవన అంచనాలతో గతంలో
దూసుకెళ్లిన మార్కెట్లు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయి. షాంఘై, షెన్జెన్ మార్కెట్లలోని 300 ప్రధాన కంపెనీల పనితీరును ప్రతిబింబించే సీఎస్ఐ 300 సూచీ జూన్ గరిష్ఠ స్థాయి నుంచి సుమారు 20 శాతం పడిపోయింది. అక్టోబర్ 22న ఒక్కరోజే ఈ సూచీ 1.6 శాతం వరకు క్షీణించింది. హాంకాంగ్‌లో నమోదైన చైనా కంపెనీల షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అక్కడి ప్రధాన షేర్ల సూచీ 2.9 శాతం వరకు పడిపోయింది. గరిష్ఠ స్థాయి నుంచి 20 శాతం పతనాన్ని సాధారణంగా బేర్ మార్కెట్‌గా పరిగణిస్తారు. ఈ పరిణామం చైనా ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న ఆందోళనలను ప్రతిబింబిస్తోంది.
ఏఐపై ఆశలు ఆవిరి.. లాభాలపై సందేహాలు
చైనా సాంకేతిక రంగం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుందనే అంచనాలు గతంలో పెట్టుబడులను ఆకర్షించాయి. ఏఐ అభివృద్ధికి బీజింగ్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం కూడా టెక్నాలజీ షేర్ల పెరుగుదలకు దోహదపడింది. అయితే కంపెనీల విలువలు పెరిగినంత వేగంగా వాటి లాభాలు పెరుగుతున్నాయా అనే ప్రశ్న ఇప్పుడు ముందుకొస్తోంది. అంచనాలు అధికంగా ఉండి, వాస్తవ లాభాలు నిరాశపరిస్తే షేర్ల పతనం తప్పదనే పరిస్థితి కనిపిస్తోంది. అంతర్జాతీయంగా ఏఐ సంబంధిత షేర్లలో అమ్మకాలు పెరగడం కూడా ఆసియా మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. మరోవైపు చైనా వినియోగదారులు ఖర్చు చేయడంలో వెనుకంజ వేస్తుండటంతో దేశీయ డిమాండ్ బలహీనంగా ఉంది. మూడో త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి అంచనాలను మించినప్పటికీ, ప్రజల కొనుగోళ్లు పెరగడం, కంపెనీల ఆదాయాలు మెరుగుపడటం వంటి సంకేతాల కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వ ఉద్దీపనపై తగ్గి ఆశలు
చైనా ప్రభుత్వం మార్కెట్లను నిలబెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, భారీ కొత్త ఉద్దీపన ప్యాకేజీపై ఆశలు తగ్గడం పెట్టుబడిదారులను నిరాశకు గురిచేస్తోంది. ప్రభుత్వ మద్దతుతో షేర్ల కొనుగోళ్లు తాత్కాలికంగా పతనాన్ని అడ్డుకోవచ్చు కానీ, దీర్ఘకాలిక వృద్ధికి బలమైన కంపెనీ లాభాలు, వినియోగ డిమాండ్ అవసరం. ప్రపంచంలో అతిపెద్ద బ్యాటరీ తయారీ సంస్థగా ఉన్న కాంటెంపరరీ ఆంపెరెక్స్ టెక్నాలజీ (సీఏటీఎల్) త్రైమాసిక లాభాల వృద్ధి అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో బుధవారం దాని షేర్లు 12 శాతం పడిపోయాయి. రంగానికి లభిస్తున్న విధానపరమైన మద్దతు తగ్గుతున్న నేపథ్యంలో కంపెనీల వృద్ధిపై సందేహాలు పెరిగాయి. చౌకగా కనిపించే షేర్లు తప్పనిసరిగా మంచి పెట్టుబడులు కావని భిల్వారియాఫిన్సర్వ్ భాగస్వామి అభిషేక్ భిల్వారియా హెచ్చరించారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ, బలహీన వినియోగం, ఉద్దీపనపై అనిశ్చితి, ఏఐ షేర్ల ఒడిదుడుకులు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయని వివరించారు. పెట్టుబడికి ముందు కంపెనీల ఆదాయ సామర్థ్యం, వ్యాపార పునాదులు పరిశీలించాలని సూచించారు.
కోలుకోవాలంటే.. వాస్తవ వృద్ధి తప్పనిసరి
చైనా మార్కెట్ పతనాన్ని కొనుగోళ్లకు అవకాశంగా చూడాలా అనే ప్రశ్న ఇప్పుడు పెట్టుబడిదారులను వేధిస్తోంది. షేర్ల ధరలు తగ్గడం ఒక్కటే పెట్టుబడికి సరైన సమయం వచ్చిందని నిరూపించదని నిపుణులు చెబుతున్నారు. వినియోగదారుల ఖర్చులు పెరగడం, కంపెనీల లాభాలు మెరుగుపడటం, ప్రభుత్వ విధానాలు వ్యాపారాలకు స్పష్టమైన ప్రయోజనాలు అందించడం కీలకమని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు మార్కెట్లను వేగంగా ప్రభావితం చేసే పరిస్థితుల్లో పెట్టుబడులను వివిధ రంగాలు, మార్కెట్లలో విస్తరించడం అవసరమని భిల్వారియా సూచించారు. చైనా షేర్లకు స్థిరమైన పునరుద్ధరణ రావాలంటే తాత్కాలిక ర్యాలీలు సరిపోవు; ఆర్థిక పరిస్థితులు, కంపెనీల ఆదాయాలు, పెట్టుబడిదారుల విశ్వాసం మెరుగుపడాలి. అప్పుడే ప్రస్తుత పతనం నుంచి మార్కెట్ నిలకడగా కోలుకునే అవకాశం ఉంటుంది.
#ChinaStockMarket #ChinaMarketCrash #CSI300 #ChineseStocks #AIMarket #StockMarketNews #CATL #ChinaEconomy #BearMarket #GlobalMarkets #InvestmentNews











