Home Inter National News హీరో పైలట్‌కు దుబాయ్ యువరాజు పరామర్శ

హీరో పైలట్‌కు దుబాయ్ యువరాజు పరామర్శ

ఆసుపత్రికి వచ్చి మరీ స్మిత్ మచ్చర్‌కు థ్యాంక్స్.

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, ప్రాణాలకు తెగించి 172 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌ను ఆసుపత్రిలో పరామర్శించారు. దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో స్మిత్ మచ్ఛర్ కెప్టెన్‌గా ఉన్నారు. విమానం గాల్లో ఉండగానే సహ పైలట్ హమామ్ అల్‌హమ్మామి, కాక్పిట్ క్రాష్ యాక్స్‌తో కెప్టెన్‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ స్మిత్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోరాడారు.

గాయాలతోనూ తెరిచిన కాక్పిట్ తలుపు

ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన పెనుగులాటలో విమానం వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. ప్రమాదం తప్పదనే పరిస్థితి నెలకొంది. అయినా స్మిత్ అసాధారణ ధైర్యం ప్రదర్శించారు. కాక్పిట్ తలుపు తెరిచి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. వెంటనే ప్రయాణికులు లోపలికి దూసుకెళ్లి దాడి చేసిన సహ పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. విమానాన్ని స్థిరంగా నడిపేందుకు ఆఫ్‌డ్యూటీ పైలట్లు కూడా సహకరించారు. స్మిత్ చూపిన సమయస్ఫూర్తి కారణంగానే భారీ ప్రాణనష్టం తప్పిందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

స్మిత్‌పై ప్రశంసల జల్లు

స్మిత్‌ను పరామర్శించిన అనంతరం క్రౌన్ ప్రిన్స్ ఆయన ధైర్యాన్ని కొనియాడారు. దేశ నాయకత్వం తరఫున పూర్తి అభినందనలు, ప్రశంసలు అందిస్తున్నామని తెలిపారు. స్మిత్ తమ బృందంలో భాగమని, యూఏఈ నిలబెట్టే మానవత్వం, శాంతి, ప్రాణాల విలువకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత పైలట్ సాహసాన్ని ప్రశంసించారు. దాడి వెనుక కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

కోలుకుంటున్న భారత వీరుడు

ఈ ఘటనపై ఉగ్రవాద సంబంధిత కోణం ఉందా అనే అంశాన్ని కూడా యూఏఈ అధికారులు పరిశీలిస్తున్నారు. సహ పైలట్ గతంలో ఒమన్‌లో విమానాలు నడపకుండా నిషేధానికి గురైనట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ప్రస్తుతం స్మిత్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యూఏఈలోని భారత రాయబార కార్యాలయం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని తెలిపింది. కుటుంబంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని వెల్లడించింది. స్మిత్ తండ్రి భూపేంద్ర మచ్ఛర్ మాత్రం గాయాలు పూర్తిగా తగ్గేందుకు ఇంకా చాలా సమయం పడుతుందని తెలిపారు.

 

#DubaiCrownPrince #SheikhHamdan #SmithMachar #CaptainSmithMachar #IndianPilot #Flydubai #DubaiTelAvivFlight #PilotHero #PilotBravery #UAE #AviationNews #CockpitAttack #FlydubaiIncident #IndianPilotHero