గెలవలేని యుద్ధాన్ని కొనసాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలను పెనం మీద నుంచి పొయ్యిలోకి నెట్టేస్తున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. గెలవడం కష్టమని తెలిసినా అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ట్రంప్ దూకుడు, అమెరికా దాడులు, ఇరాన్ ప్రతీకార చర్యలు మధ్యప్రాచ్యాన్ని మరోసారి అగ్నిగుండంగా మార్చుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు ప్రాణాధారమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం నెలకొంది. ఒక ప్రాంతీయ ఘర్షణగా మొదలైన ఈ వివాదం ప్రపంచ మార్కెట్లను, ఇంధన ధరలను, దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేసే స్థాయికి చేరుకుంటోంది.
హర్మూజ్ జలసంధి మూసివేతతో ఉద్రిక్తత
మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గమైన హర్మూజ్ జలసంధిని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అనుమతి లేని మార్గంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై హెచ్చరిక కాల్పులు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ విప్లవ గార్డులు వెల్లడించారు. తమ సూచనలను పట్టించుకోకుండా ప్రయాణించిన నౌకలను నిలిపివేసినట్లు ప్రకటించారు. అమెరికా జోక్యం కొనసాగినంత వరకు హర్మూజ్ మార్గంలో వాణిజ్య నౌకలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది.
అమెరికా 140 లక్ష్యాలపై వైమానిక దాడులు
ఇరాన్ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే అమెరికా భారీ స్థాయిలో ప్రతిదాడి ప్రారంభించింది. ఈ వారంలో మూడోసారి జరిపిన దాడుల్లో మొత్తం 140 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. క్షిపణి స్థావరాలు, డ్రోన్ కేంద్రాలు, నౌకాదళ సదుపాయాలు, మందుగుండు సామగ్రి గిడ్డంగులు, సమాచార వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న సైప్రస్ జెండా కలిగిన కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి చేసినందుకే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా పేర్కొంది. ఈ దాడులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణుల దాడి
అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ బహ్రెయిన్, ఖతార్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైపు క్షిపణులు ప్రయోగించినట్లు సమాచారం. యూఏఈ గగనతల రక్షణ వ్యవస్థలు క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నట్లు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. బహ్రెయిన్‌లో వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు మోగించగా, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. ఖతార్‌లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో అప్రమత్త ప్రకటనలు జారీ అయ్యాయి. కువైట్ సైన్యం తమ గగనతలంలోకి వచ్చిన క్షిపణులను అడ్డుకున్నట్లు వెల్లడించింది.
చమురు మార్కెట్లపై ప్రభావం
ఈ తాజా పరిణామాలు మధ్యప్రాచ్య పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చాయి. గతంలో యుద్ధ విరమణ కోసం కుదిరిన తాత్కాలిక ఒప్పందం ఇప్పటికే బలహీనపడగా, ఇప్పుడు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు, సహజవాయు రవాణాకు అత్యంత కీలక మార్గం కావడంతో దాని మూసివేత అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. యుద్ధానికి ముందు ఉన్నట్లుగా స్వేచ్ఛాయుత నౌకాయానానికి అనుమతి ఉండదని ఇరాన్ ప్రకటించడం కొత్త ఆందోళనలకు దారితీసింది. మరోవైపు ఈ దాడులు కొనసాగితే మధ్యప్రాచ్య సంక్షోభం మరింత విస్తరించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Home Inter National News గెలవలేమని తెలిసి మళ్లీ యుద్ధం ఇరాన్‌పై అమెరికా వార్‌తో రగడ దాడులతో ఆర్థిక...










